Advertisement

తప్పు చిరుదా..?బాలయ్యదా..?

Wed 28th Dec 2016 01:52 PM
mega star chiranjeevi,khaidi no 150 movie,balakrishna,gautamiputra satakarni movie,chiru fans,balaiah fans  తప్పు చిరుదా..?బాలయ్యదా..?
తప్పు చిరుదా..?బాలయ్యదా..?
Advertisement

చాలాకాలం గ్యాప్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150', నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. దాంతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య రోజురోజుకూ బెట్టింగ్‌లు, వార్నింగ్‌లు, వాదనలు ఎక్కువవుతున్నాయి. సంక్రాంతికి చేసే కోడిపందేల జోరు తగ్గుతుందేమో? లేక క్రికెట్‌ బెట్టింగ్‌లకుచెక్‌ పడవచ్చేమో గానీ ఈ ఇరువురు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాత్రం హోరాహెరి బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఈ చిత్రాలను కేవలం సినిమాలుగా మాత్రమే చూడకుండా, కొందరు దీనికి కులాల మధ్య పోరుగా, పార్టీల మధ్య పోరుగా చిత్రీకరిస్తూ వారి వారి అభిమానులను రెచ్చగొడుతున్నారు. 

దీంతో ఇరు సామాజిక వర్గాల సామాన్యులు కూడా రెచ్చిపోతున్నారు. మరోపక్క తన టీజర్‌లో చిరు 'స్వీటింగ్‌ వార్నింగ్‌' అనడంతో, 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్‌ మరింత ఆవేశపడి, సంక్రాంతికి వస్తున్నాం... ఖబడ్దార్‌... అంటూ స్వీట్‌ వార్నింగ్‌ కాకుండా ఘాటు వార్నింగే ఇచ్చాడు. ఇక ఈ చిత్రం తన కోపంలోంచి వచ్చిందని, ఇలాంటి వీరుడు ఏ విదేశాల్లోనో పుట్టి ఉంటే ఇప్పటికి అతని వీరత్వాన్ని పొగుడుతూ, ఎన్నో పుస్తకాలు, మరెన్నో చిత్రాలు వచ్చేవని, ఈ చిత్రం తెలుగువీరుడి గాథగా, ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించేలా ఉంటుందని కూడా క్రిష్‌ ఉద్వేగంగా చెప్పాడు. 

కాగా ఈ చిత్రం ఆడియో వింటుంటే... ఈ చిత్రంలోని పాటలన్నీ సందర్భానుసారంగా వచ్చేవని, విజువల్‌గా చూస్తేనే కిక్కు వస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మాస్‌ మసాలా సాంగ్స్‌ పెట్టడానికి ఇది ఏదో అల్లాటప్పా చిత్రం కాదని, కాబట్టి ఆడియో విషయంలో బాలయ్య అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నా, చిత్రం విడుదలైన తర్వాత వారే మెచ్చుకుంటారని సీనియర్‌ బాలయ్యఫ్యాన్స్‌ విశ్లేషిస్తున్నారు. మరోపక్క చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' ఆడియో ఇప్పటికీ పూర్తిగా విడుదల కాకున్నా ఇప్పటికే రెండు పాటలు విజువల్స్‌తో సహా విడుదలై రచ్చ చేస్తున్నాయి. 

మూడోపాట ఈ రోజు సాయంత్రం 6గంటలకు విడుదల కానుంది. దీనికోసం చిరు ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే... ఈ రెండు చిత్రాల టీజర్స్‌, ట్రైలర్స్‌, మేకింగ్‌ వీడియోలు యూట్యూబ్‌లో బాగా ఆదరణ పొందుతున్నాయి. కానీ సినిమాల నిర్మాతలు మాత్రం ఇన్ని లక్షల వ్యూస్‌ వచ్చాయి... అన్ని లక్షల మంది వీక్షించారు అని లెక్కలు చెబుతూ వారి అభిమానులను రెచ్చగొడుతున్నారు. 

నేడున్న రోజుల్లో ఫేక్‌ రికార్డులు, లెక్కలు ఎలా ఉంటాయో? అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి ఈ విషయంలో లెక్కలు అనవసరం. మరో విశేషం ఏమిటంటే..! బాలయ్య...చిరు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే తిరుపతిలో ఆడియో వేడుక చేయగా, చిరు.. బాలయ్య సామాజిక వర్గం ఆధిపత్యం వహించే విజయవాడలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రెడీ అవుతున్నాడు. మొత్తానికి చిరు వేడుకలో అయినా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, ప్రసంగాలు ఉండవని ఆశిద్దాం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement