ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi vs Rajinikanth: Double Box Office Clash

2026-27 లో మెగాస్టార్ వ‌ర్సెస్ సూపర్ స్టార్!

Chiranjeevi vs Rajinikanth: Double Box Office Clash

 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేనివిధంగా సరికొత్త బాక్సాఫీస్ వార్‌కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి -సౌత్-ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య 2026-27 సంవత్సరంలో ఏకంగా రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. దశాబ్దాలుగా తమదైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఇద్దరు దిగ్గజాలు ఒకే సీజన్‌లో కాకుండా? బ్యాక్-టు-బ్యాక్ రెండు ప్రధాన పండుగ సీజన్లలో తలపడనుండటం సినీ వర్గాలలో  చర్చనీయాంశమైది. పాన్-ఇండియా ట్రెండ్ జోరుగా సాగుతున్న తరుణంలో  లెజెండరీ హీరోల మధ్య జరిగే పోరు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.

మొదటి విడతగా దసరా పండుగ సీజన్‌లో ఇద్దరు సీనియర్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్ ఖాయమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రం `జైలర్ 2` అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుండగా..సరిగ్గా  మరుసటి రోజే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫ్యాంటసీ మూవీ `విశ్వంభర` ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే  రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. గతంలో కూడా ఇలాంటి క్లాష్‌లు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో ఈసారి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దసరా ఫైట్ ముగిసిన వెంటనే 2027 సంక్రాంతి బరిలోనూ  ఇద్దరు అగ్ర హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సీజన్‌ను సెంటిమెంట్‌గా భావించే చిరంజీవి-  బాబీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `మెగా 158` చిత్రాన్ని పండగ బరిలో దింపుతున్నారు. అదే సమయంలో కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న `ధర్మన్` సినిమా కూడా సంక్రాంతికే విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్‌కు ఉన్న హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ -తమిళనాడులో రజనీకాంత్ మేనియా ఏ స్థాయిలో ఉంటాయో ? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మొత్తంగా  చిరంజీవి -రజనీకాంత్ వంటి దిగ్గజాల సినిమాలు ఒకే ఏడాదిలో రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద ఎదురు పడటం  సినిమా చరిత్రలో  అరుదైన పరిణామం. ఎవరి స్టామినా ఏంటో? నిరూపించుకోవడానికి ఈ పోరు  వేదికగా మారుతుండగా? బాక్సాఫీస్ రికార్డులు మాత్రం బద్దలవడం ఖాయ‌మ‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

Megastar vs Superstar: Two Box Office Battles