కేవలం 5 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉండే వినోద రంగంలో వ్యాపారం చేసిన వాళ్లు ఏ ఇతర రంగంలో అయినా రాణించడం కష్టమేమీ కాదు. అలా ఇప్పుడు వినోద రంగంతో పాటు క్రీడా రంగం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎడ్యుకేషన్ రంగం, వైద్య రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో కార్పొరెట్ దిగ్గజాలు పాగా వేసినందున క్రీడా రంగం కూడా సురక్షితమైన పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఐపిఎల్ టీమ్ ని కొనుగోలు చేసేందుకు పెద్ద ప్రణాళికతో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అమెరికాలో పంపిణీ రంగంలో హవా సాగించి, అటుపై టాలీవుడ్ లో బడా నిర్మాతలుగా ఎదిగిన పెద్ద నిర్మాణ సంస్థ అధినేతలు ఇకపై క్రీడా రంగంలో అత్యంత లాభాల్ని అందించే అవకాశం ఉన్న అంశాలను పరిశీలించి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
తొలిగా విజయవాడలో ఒక చిన్న టోర్నీలో ఆడే టీమ్ ని కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ తో అనుబంధం పెంచుకునే వ్యూహంలో ఉంది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్ ని నిర్వహించడం ద్వారా ఈ రంగంపై అవగాహన పెంచుకునేందుకు సదరు సినీనిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోంది. నిజానికి ఈ ప్రయత్నం ఎంతో ఆహ్వానించదగినది. తెలివైనది.. క్రీడా రంగంలో, ముఖ్యంగా ఐపిఎల్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కింగ్ ఖాన్ షారూఖ్, నీతా అంబానీ, జూహీ చావ్లా వంటి ప్రముఖులు భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పుడు అదే తరహా బిజినెస్ ఫార్మాట్ ని అర్థం చేసుకునేందుకు టాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రయత్నించడం నిజంగా ప్రోత్సహించదగిన స్టెప్.