ఎగ్జిబిషన్ రంగం ఇప్పటికే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని థియేటర్ యజమానులు చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్లు ఇప్పటికే అంతరించిపోయాయి. వాటి స్థానంలో మల్టీప్లెక్సులను నిర్మిస్తున్నారు. అయితే మల్టీప్లెక్సుల ఆదాయం కూడా ఇటీవల ఘననీయంగా తగ్గిపోయిందని, దీంతో పీవీఆర్ లాంటి సంస్థలు కొత్త స్క్రీన్ల నిర్మాణానికి వ్యయం చేయకూడదని నిర్ణయించుకుందని కూడా గుసగుసలు వినిపించాయి.
అయితే ఇలాంటి సమయంలో కర్నాటక ప్రభుత్వం పెద్ద బాంబ్ పేల్చింది. మల్టీప్లెక్సులు లేదా సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.200 మించకూడదనే నియమాన్ని పాస్ చేసింది. దీంతో ఇది ఎగ్జిబిటర్లను ఖంగు తినేలా చేసింది. అకస్మాత్తుగా ప్రభుత్వమే ఈ రూల్ పాస్ చేయడంతో ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. ఇకపై బెంగళూరు సహా కర్నాటకలోని టూటైర్ నగరాల్లోను ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల ఆదాయం భారీగా పడిపోనుందని భావిస్తున్నారు. హుబ్లీ, ధార్వాడ్, బెలగావి వంటి పట్టణ ప్రాంతాల్లోను థియేటర్లకు ఆదాయం తగ్గిపోనుంది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయంతో ఇటు తెలుగు, తమిళం నుంచి వస్తున్న సినిమాలకు బిగ్ పంచ్ పడుతుందని భావిస్తున్నారు.
టికెట్ ధర తగ్గితే జనం తియేటర్ల వైపు క్యూ కడతారు. కానీ థియేటర్ల నిర్వహణ భారం పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే 200 టికెట్ ధర అంటే చాలా తక్కువ అని ఎగ్జిబిటర్ల సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించేందుకు కన్నడ ఎగ్జిబిటర్లు సిద్ధమవుతున్నారని సమాచారం. వాస్తవానికి ఏషియన్ సినిమాస్ తో కలిసి బెంగళూరు సహా కర్నాటకలో థియేటర్ల వ్యాపారాన్ని పెంచాలని భావిస్తున్న మహేష్, ఇతర తెలుగు స్టార్లకు ఇది బిగ్ జోల్ట్ అనడంలో సందేహం లేదు. మల్టీప్లెక్స్ వ్యాపారాలపై ప్రభుత్వ నిబంధనలు పెరిగే కొద్దీ ఈ తరహా వ్యాపారం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేందుకు ఆస్కారం లేదు. అదే సమయంలో టికెట్ ధర తగ్గితే బ్లాక్ మార్కెటింగ్ జోరందుకుంటుంది. థియేటర్ యజమానులే బ్లాక్ లో టికెట్లను విక్రయించాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు. బెంగళూరు సహా పలు నగరాల్లో తెలుగు తమిళ చిత్రాలు గొప్ప ఆదాయాన్ని తెస్తున్నాయి. ఇకపై ఈ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మునుముందు పాన్ ఇండియన్ సినిమాల బడ్జెట్లను కూడా ఇది ప్రభావితం చేసేందుకు ఆస్కారం లేకపోలేదు.