ఆకాశంలో ఒక తార సినిమా: సినీజోష్ రివ్యూ
Aakasamlo Oka Tara Movie Reviewఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ
డైరెక్టర్ : పవన్ సాదినేని
నిర్మాతలు: సందీప్ గున్నం-రమ్య గున్నం
రిలీజ్ తేదీ: 20-11-2026
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ
`సీతారామం`, `మహానటి`, `లక్కీ భాస్కర్` వంటి చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులలో బలమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా దుల్కర్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన `ఆకాశంలో ఒక తార` అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
వ్యోమగామి కావాలనే యువతి ఆశయం.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆసక్తికర కథాంశం.. ప్రతిభావంతులైన నటీనటులతో ఈ చిత్రం అంచనాలను పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఆకాశంలో ఒక తార సినిమా: కథా విశ్లేషణ
మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) అనే యువతికి వ్యోమగామి కావాలనే కల ఉంటుంది. అయితే కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో ఆమెకు బలవంతంగా వివాహం జరగడంతో ఆమె ఆశయాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఈ కథాంశం చుట్టూనే ఆకాశంలో ఒక తార తిరుగుతుంది.
తన జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నా? తన ఆశయాలను నిలబెట్టుకోవడానికి కల్పన చేసే పోరాటమే ఈ కథ. కృష్ణ సోదరి సరస్వతి (స్వాసిక), బావ రాజేష్ (ప్రవీణ్), కల్పన తండ్రి శివయ్య (కోట జయరామ్), బిజిలీ (రుహానీ శర్మ), మాధవన్ (వాసు ఇంటూరి), రోహిణి (శ్రుతి హాసన్), శంకర్ నారాయణ్ (మురళీ శర్మ) పాత్రలు ఆమె ప్రయాణాన్ని మలుపుతిప్పే పరిణామాలలో భాగమవుతాయి.కల్పన ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంది? చివరికి తన కలను నెరవేర్చుకుందా లేదా? అన్నదే మిగతా కథ.
ఆకాశంలో ఒక తార సినిమా: నటీనటుల పనితీరు
కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకుంది. అమాయకపు పల్లెటూరి అమ్మాయి నుండి తన పరిస్థితులను అర్థం చేసుకుని ఆశయాల కోసం పోరాడే మహిళగా పాత్రలోని విభిన్న దశలను ఆమె ఎంతో పరిణతితో పోషించింది. ఆమె భావోద్వేగ సన్నివేశాలు, సంభాషణలు చెప్పే విధానం బాగా కుదిరాయి. సినిమాలోని ప్రధాన సంఘర్షణను సమర్థవంతంగా మోసింది.
దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకు ప్రధాన బలం. కథనంలో ఆయనది సహాయక పాత్రే అయినా? కథకు అవసరమైన ఆత్మీయతను, భావోద్వేగ లోతును అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు, సహజమైన నటన సినిమాకు ఎంతో విలువను చేకూర్చాయి. శ్రుతి హాసన్ ఉత్సాహభరితమైన పాత్రతో ప్రభావం చూపింది. ఆమె ఎంట్రీ కథనానికి కొత్త కోణాన్ని తీసుకురావడమే కాకుండా ద్వితీయార్థంలో ఆసక్తిని పెంచింది.
రుహానీ శర్మకు విభిన్నమైన పాత్ర దక్కింది. ఆమె పరిధి మేరకు బాగా నటించింది. స్వాసిక, ప్రవీణ్ తమ పాత్రలలో సమర్థవంతంగా రాణించారు. మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గెటప్ శ్రీను, వాసు ఇంటూరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కోట జయరామ్, మహేష్ ఆచంట, నాజర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఆకాశంలో ఒక తార సినిమా: సాంకేతిక నిపుణుల పనితీరు
పవన్ సాధినేని ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకుని వ్యోమగామి కావాలనే యువతి ఆశయం చుట్టూ కథను నడింపించారు. రివర్స్ స్క్రీన్‌ప్లే విధానంతో ఆరంభ సన్నివేశాలు ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఆకట్టుకుంటాయి. ప్రధాన జంట వివాహం తర్వాత కథ రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లినప్పటికీ భావోద్వేగ సంఘర్షణ కథనాన్ని ముందుకు నడిపిస్తుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అవ్వడంతో ఆసక్తికరమైన సెకండాఫ్‌కు దారితీస్తుంది. శ్రుతి హాసన్ ఎంట్రీ తర్వాత జరిగే పరిణామాలు ప్రధాన జంట బంధానికి కొత్త కోణాన్ని తీసుకొస్తాయి. తన ప్రధాన పాత్ర నుండి దృష్టి మరల్చకుండా మహిళా సాధికారత.. బాలికా విద్య ప్రాముఖ్యత గురించి సందేశాన్ని అందించడంలో కూడా సినిమా విజయం సాధించింది.
అయితే కొన్ని కీలక ప్రాంతాలలో స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉండాల్సింది. కల్పన వ్యోమగామిగా ఎదిగే ప్రయాణాన్ని మరింత వివరంగా చూపించాల్సింది. రాకెట్ ప్రయోగ అవకాశం, ఎంపిక ప్రక్రియను మరింత తీవ్రతతో, సంక్లిష్టతతో చూపించొచ్చు. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసినట్లు అనిపిస్తాయి.ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాలో అత్యుత్తమ భాగాలలో ఒకటిగా నిలుస్తాయి. భావోద్వేగ క్షణాలు బాగా పండి, కథకు సంతృప్తికరమైన ముగింపును ఇచ్చాయి.
జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు బలాన్నిచ్చి ముఖ్యమైన ఘట్టాలకు ప్రాణం పోసింది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. పల్లెటూరి లొకేషన్లు సహజంగా, ఆకర్షణీయంగా ఉండగా, అంతరిక్ష సంబంధిత విజువల్స్, రాకెట్ ప్రయోగ సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు. సంభాషణలు భావోద్వేగభరితంగా ఉండి కథకు ఉపయోగపడ్డాయి.ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు సినిమా వేగానికి అడ్డుపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఆకాశంలో ఒక తార సినిమా: ప్లస్ పాయింట్స్
ఆసక్తికరమైన ప్రధాన కథాంశం
దుల్కర్ సల్మాన్ ప్రజెన్స్
సాత్విక వీరవల్లి నటన
భావోద్వేగ సన్నివేశాలు
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
ఆకాశంలో ఒక తార సినిమా: మైనస్ పాయింట్స్
అక్కడక్కడా ఊహించదగిన స్క్రీన్‌ప్లే
సాగదీసినట్లుగా ఉన్న కొన్ని సన్నివేశాలు
ఆకాశంలో ఒక తార సినిమా: రేటింగ్ విశ్లేషణ
ఆకాశంలో ఒక తార కలలను నెరవేర్చుకోవాలనే ఒక మహిళ పట్టుదల చుట్టూ నిర్మించబడిన ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా. పవన్ సాధినేని అర్థవంతమైన అంశాన్ని ఎంచుకుని నటీనటుల నుండి ముఖ్యంగా సాత్విక వీరవల్లి, దుల్కర్ సల్మాన్ నుండి మంచి నటనను రాబట్టుకున్నారు.సినిమాలో రొటీన్ కథనం, వేగం మందగించడం వంటి కొన్ని లోపాలున్నాయి. అలాగే వ్యోమగామి ప్రయాణాన్ని మరింత వివరంగా చూపించి ఉండొచ్చు. అయితే సినిమాలో భావోద్వేగ బలం, నటీనటుల అభినయం, ఆకట్టుకునే క్లైమాక్స్ లోపాలను అధిగమించడంలో సహాయపడతాయి.మరింత బిగువైన స్క్రీన్‌ప్లే, ప్రధాన ఆశయాన్ని మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే ఇది మరింత గొప్ప చిత్రంగా నిలిచేది. ఈ పరిమితులు ఉన్నా? `ఆకాశంలో ఒక తార` థియేటర్లలో మంచి అనుభూతిని అందిస్తుంది. నటీనటుల పనితీరు, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు కలిసొచ్చాయి.
ఆకాశంలో ఒక తార మూవీ రేటింగ్: 3.5/5
పంచ్ లైన్: అందమైన ఎమోషనల్ జర్నీ
















































