గొడవలకు మూల కారణాలు మూడు.. ఆస్తులు అంతస్తులు ధన దాహం.. అధికారంతో వచ్చే రాజయోగం.. పొరుగువారిపై ఆధిపత్యం.. ఈ మూడింటి చుట్టూ ప్రపంచంలోని గొడవలన్నీ ముడిపడి ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న చమురు నిల్వలు, గనులు లేదా ఖనిజాలన్నిటినీ తవ్వుకు పోవాలని అగ్ర రాజ్యాలు కుట్రలు చేస్తాయి. దేశాల మధ్య కొట్లాటలు సృష్టిస్తాయి. వజ్రాల గని కోసం లేదా కోహినూర్ కోసం కొట్టుకున్నా దీని చుట్టూ రాజకీయాలు, కుట్రలు పరిశీలిస్తే అదంతా ఒక చరిత్ర. ఇదే ఫార్ములా ఇప్పుడు దేశంలోని చాలా రాజకీయ కుటుంబాలకు వర్తింపజేయాలి. ఇతరుల మాటేమో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఏలిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తులు- అధికార ఆధిపత్య గొడవల గురించి, కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు, ఆధిపత్య గొడవల గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ముఖ్యంగా దివంగత వైయస్సార్ కుటుంబంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో షర్మిల గొడవ, అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయంగా అంతర్యుద్ధం గురించి మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. ఆస్తి విషయంలో జగనన్న తన చెల్లిని సైతం లెక్క చేయకుండా, తనకు ఇచ్చిన ఆస్తిని తిరిగి లాక్కోవడం, ఆస్తి పంపకాల్లో అన్యాయం చేయడం.. దానికోసం కోర్టుల్లో పోరాడటం కొన్ని నెలల క్రితం సంచలనంగా మారింది. షర్మిలకు సొంత అన్నయ్యే రాజకీయంగాను ప్రాధాన్యత లేకుండా చేయడంతో తనే స్వయంగా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీని స్థాపించి, చివరికి కాంగ్రెస్ లో చేరడం తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా షర్మిల తనవంతు పాత్రను పోషిస్తున్నారు. చివరికి దిక్కు తోచని స్థితిలో వైయస్ విజయమ్మకు తన కొడుకు కంటే, తన కుమార్తె షర్మిలకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 10కోట్ల మంది ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఆస్తి తగాదాలు కుటుంబాల్ని విడదీస్తాయి. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, తండ్రి కూతుళ్ల మధ్య వైరుధ్యాలను సృష్టించగలవు. కొన్నిసార్లు కుట్రలు కక్షలతో చంపుకునేవరకూ కూడా వెళుతుంటుంది.
జగన్ ఫ్యామిలీ డ్రామా ఇలా ఉంటే, ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలోని ఆధిపత్య పోరు ప్రధానంగా చర్చల్లోకి వస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ వరుసగా ముఖ్యమంత్రి అయ్యి పదవిలో ఉన్న కాలంలో లక్షల కోట్లు కూడబెట్టారనేది ఒక ప్రచారం. అయితే తెరాసలో నంబర్ 2 గా ఉన్న మేనల్లుడు హరీష్ రావుతో కేసీఆర్ వార్ ఎప్పుడూ చర్చనీయాంశమే. అధికారం, ఆస్తులు లేదా ఏ విషయంలో అయినా కానీ తన కొడుకు యువనాయకుడు కేటీఆర్ కోసం కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావుని దూరం పెట్టాడని ప్రతిపక్షాలు రెగ్యులర్ గా విమర్శించే మాట. అకస్మాత్తుగా విదేశాల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఇద్దరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఆ ఇద్దరు వారసులు రాజకీయాల్లో స్టార్లు అయ్యారు. అయితే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి, సిద్ధిపేట నియోజక వర్గంలో తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్న హరీష్‌రావు పార్టీలో నంబర్ 2 గా నిలదొక్కుకున్నారు. కానీ కేసీఆర్ ఇటీవల వరంగల్ సభలో తన కుమారుడు కేటీఆర్ తన తర్వాత ముఖ్యమంత్రి అవుతాడనే సంకేతాలు ఇవ్వడం ద్వారా కూడా కేసీఆర్ తన మేనల్లుడిని దూరం పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
ప్రతి కుటుంబంలో అధికారం కోసం లేదా ఆస్తులు, అంతస్తుల పంపకాల కోసం ఇలాంటి అంతర్యుద్ధం రెగ్యులర్ గా చూసేదే. సినీ నటుడు మోహన్ బాబు విషయంలో కూడా ఆస్తుల వ్యవహారాల్లో అన్నదమ్ములైన మంచు విష్ణు-మంచు మనోజ్ లు కుటుంబ పరువును రోడ్డు కు కీడ్చారు. ఈ వ్యవహారానికి మోహన్ బాబు ముగింపు పలకలేక సతమతమవుతున్నారు.
అయితే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో పొలిటికల్ మెలోడ్రామా లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ వ్యవహారం తర్వాత మరింత రచ్చకెక్కుతోంది. తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత బహిరంగంగా కేసీఆర్ కు ఒక లేఖ రాయడం, అది లీకవ్వడం తెలంగాణ పొలిటికల్ కారిడార్ లో కలకలం రేపింది. అన్నా చెల్లెళ్ల ఆస్తి పంపకాలు, అధికారం పంపిణీలో కూడా అసమానత ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కుంపటిని రాజేస్తోందని ఈ లేఖ బట్టబయలు చేసింది. కుటుంబంలో కుమారుడికి మాత్రమే కేసీఆర్ ప్రాధాన్యతనివ్వడం, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కూతురిని పక్కన పెట్టడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారుతోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని, అది తన ప్రాధాన్యతను తగ్గించాయని నమ్ముతున్నట్టు కవిత విమర్శించడం చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు ఏ స్థాయికి ముదిరాయో అర్థం చేసుకోవచ్చు. అధికారం అంతా తన అన్నకే తండ్రి కట్టబెడితే పార్టీలో తన స్థానం ఏమిటి? అనేది కవితకు కంటిమీద కునుకుపట్టనీకుండా చేసిన అంశం. అటు వరంగల్ సభలో సోలోగా తన అన్న కేటీఆర్ కి, ఇతర చిన్న నాయకులకు కూడా ప్రాధాన్యత దక్కగా, కవిత మాత్రం అమెరికా వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక అమెరికాలో కూడా తెలంగాణ ప్రజలు కవితను పట్టించుకోలేదని కథనాలొచ్చాయి. అంతకంతకు దిగజారుతున్న తన పరిస్థితిని చక్కదిద్దుకునేందుకే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీని వదిలేసి సొంతంగా పార్టీని ప్రారంభిస్తారని కూడా కథనాలొస్తున్నాయి. కవిత సామాజిక తెలంగాణ నినాదంతో టి- బీఆర్ఎస్ (తెలంగాణ భారత రాష్ట్ర సమితి) అనే పేరుతో పార్టీని ప్రారంభిస్తుందని కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కానీ, కవితలో భఢభాగ్ని కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద చీలికను తెచ్చిందని విశ్లేషిస్తున్నారు. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ కవిత వెనక ఉండి ఆడిస్తున్న నాటకమని, మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్ లో అంటిన మరకను బీఆర్ఎస్ కు అంటకుండా జాగ్రత్త పడుతూ, కేసీఆర్- కేటీఆర్ ప్రభృతులు ఈ కొత్త నాటకానికి తెర లేపారని కూడా విశ్లేషిస్తున్న వారు లేకపోలేదు. ప్రజలు కూడా ఆస్తులు కోసమే వీళ్ళ ఆరాటం తప్ప, జనాల కోసం చేసేది ఏమీలేదు అనుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో పొలిటికల్ మెలోడ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, కెసిఆర్ దీనికి ఎలా ముగింపు పలుకుతారో వేచి చూడాలి.
-పర్వతనేని రాంబాబు✍️