ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `రాకా`పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత కాక పుట్టిస్తున్నాయి. ఈ సినిమా సంగీతం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్ర ఆల్బమ్ కోసం అంతర్జాతీయ స్థాయి గాయకులు , గీత రచయితలతో కలిసి పనిచేస్తున్నట్లు సాయి వెల్లడించారు.
అల్లు అర్జున్‌కు సంగీతంపై ఉన్న మక్కువ అట్లీ విజన్ ఈ ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన `మేక్ వే ఫర్ ద కింగ్` థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పూర్తిస్థాయి ఆల్బమ్ విదేశీ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జానపద బాణీలను పాశ్చాత్య శైలితో మిళితం చేసి సరికొత్త సౌండింగ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
`రాకా` చిత్రం కథా నేపథ్యం కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తుండటంతో సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రానికి అంతర్జాతీయ సింగర్స్ తోడవ్వడం సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. ఒక యువ సంగీత దర్శకుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రకటనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ `రాకా` మ్యూజిక్ మ్యాజిక్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
సాయి అభ్యంకర్ 21 ఏళ్ల వయసులోనే `కచ్చి సేర`, `ఆశ కూడ` వంటి గ్లోబల్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా `రాకా`తో తన ట్యాలెంట్ ప్రపంచవ్యాప్తం చేసేందుకు సిద్ధమయ్యాడు.