ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం `రాకా` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ పోస్టర్‌లో బన్నీ మేకోవర్, ఆ గెటప్ , బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్ చూస్తుంటే దర్శకుడు శంకర్ గతంలో తీసిన `ఐ సినిమాను గుర్తు చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రాస్థెటిక్ మేకప్ , విభిన్నమైన ఆహార్యంతో అల్లు అర్జున్ కనిపిస్తుండటంతో? శంకర్ తన శిష్యుడు అట్లీ ద్వారా తన విజన్‌ను మరోసారి వెండితెరపై ఆవిష్కరిస్తున్నారా అనే చర్చ మొదలైంది.
వాస్తవానికి అట్లీ గురువు శంకర్ నుండి ఎంతో స్ఫూర్తి పొందుతుంటారు. శంకర్ `ఐ` సినిమాతో చేయాలనుకున్న విజువల్ మేజిక్ , విలక్షణమైన పాత్ర ప్రయాణం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఇచ్చినా ఆ ప్రయత్నం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు అదే తరహాలోని ఒక రా అండ్ రస్టిక్ ఇమేజ్‌ను బన్నీ `రాకా` పోస్టర్ ప్రతిబింబిస్తోంది. ఒక శిష్యుడిగా అట్లీ తన గురువు ఆశించిన స్థాయి కంటే మెరుగైన అవుట్‌పుట్‌ను ఇస్తే అది గురువుగా శంకర్‌కు కచ్చితంగా గర్వకారణమే అవుతుంది. శిష్యుడు సాధించే ప్రతి విజయం గురువు ఖాతాలోకి కూడా వెళ్తుందనడంలో సందేహం లేదు.
ఈ పోస్టర్ పోలికల వెనుక కాపీ అనే కోణం కంటే ఒక గొప్ప దర్శకుడి ఇన్ఫ్లుయెన్స్ మరో ప్రతిభావంతుడైన దర్శకుడిపై ఎలా ఉంటుందనేది స్పష్టమవుతోంది. `రాకా` చిత్రం ద్వారా అల్లు అర్జున్ - అట్లీ జోడీ ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్‌ను మరో మెట్టు ఎక్కించబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ ఒకప్పుడు వేసిన పునాదిపై అట్లీ ఇప్పుడు ఒక భారీ సౌధాన్ని నిర్మిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువు విజన్, శిష్యుడి శ్రమ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో ప్రభంజనం ఖాయం.