తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం `రెంటల్ వర్సెస్ పర్సంటేజ్` వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతూ అగ్ర పంపిణీదారులు, ఎగ్జిబిటర్లైన దిల్ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, అల్లు అరవింద్ ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఇది థియేటర్ల వ్యవస్థకు మేలు చేసే పరిణామమని వారు వాదిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నేతృత్వంలోని మరో వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
పాత అద్దె విధానమే తమకు శ్రేయస్కరమని భావిస్తూ మైత్రితో పాటు మరో 16 మంది నిర్మాతలు ఏకమై నిరసన లేఖ రాయడం గిల్డ్‌లో విభేధాలు మొదలయ్యాయనడానికి నిదర్శనం. వరుస భారీ చిత్రాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్‌కు అడ్డుకట్ట వేసేందుకే దిల్ రాజు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే గుసగుసలు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఈ అంతర్గత ఆధిపత్య పోరు కేవలం పరిశ్రమకే పరిమితం కాకుండా.. సామాన్య ప్రేక్షకుల జేబుకు మరింత చిల్లు పడుతుదని అర్థమవుతోంది. ఒకవేళ పర్సంటేజ్ పద్ధతి అమల్లోకి వస్తే.. తమకు వచ్చే వాటా తగ్గుతుందనే ఆందోళనతో నిర్మాతలు టికెట్ ధరలను పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికే పెరుగుతున్న టికెట్ ధరల వల్ల థియేటర్లకు రావడానికి వెనుకాడుతున్న ప్రేక్షకులకు ఇది మరింత భారం కానుంది. లాభనష్టాలు, వాటాల పంపకాలపై జరుగుతున్న ఈ చర్చలు త్వరగా ఓ కొలిక్కి రాకపోతే.. సినిమాల విడుదల ప్రక్రియ స్తంభించిపోయి మొత్తం చిత్ర పరిశ్రమ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.