మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం `పేట్రియట్`. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పక్కా పాన్ ఇండియా కంటెంట్‌తో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుండే ఉత్కంఠను రేకెత్తిస్తూ అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మలయాళ దిగ్గజాలు మమ్ముట్టి -మోహన్ లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సినీ అభిమానులకు కన్నులపండుగ. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం మలయాళానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయి స్పై థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది.
ఈ చిత్ర కథాంశం ఒక శక్తివంతమైన గూఢచారి డ్రామా చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్‌లో మమ్ముట్టి పాత్రను చూస్తుంటే ఆయన దేశ రక్షణ కోసం రహస్యంగా పని చేసే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లేదా గూఢచారిగా కనిపిస్తున్నారు.
``సర్ మీరు టెర్రరిస్టా? పోలీసా?`` అని అడిగే ప్రశ్నకు,ఆయన ఇచ్చే సమాధానమే ఈ సినిమా అసలు కథ. దేశభక్తి -దేశ ద్రోహం మధ్య సాగే ఈ పోరాటంలో ఒక మిషన్ కోసం ప్రాణాలకు తెగించే వీరుల కథగా ఇది ఉండబోతోంది. నయనతార, కుంచాకో బోబన్ వంటి భారీ తారాగణంతో కూడిన ఈ చిత్రం నేటి తరం ప్రేక్షకులను మెప్పించే సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.