సినిమా పరిశ్రమలో వేళ్లూనుకున్న పురుషాధిక్యత ,హీరోల అభద్రతా భావం గురించి బాలీవుడ్ నటి తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. కథా బలమున్న సినిమాల్లో హీరోయిన్ పాత్ర హైలైట్ అవుతుందనే భయంతో చిన్న హీరోలు సైతం నటించడానికి వెనకడుగు వేస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టింది. కేవలం తన ఇమేజ్ దెబ్బతింటుందనే అపోహతో, హీరోయిన్ డామినేట్ చేసే ప్రాజెక్టులను చాలా మంది హీరోలు వదులుకుంటున్నారంది. ఇది వారిలోని అభద్రతా భావానికి నిదర్శనమని తాప్సీ విమర్శించింది.
తాప్సీ గతంలో నటించిన `పింక్`, `తప్పడ్`, `బద్లా` వంటి చిత్రాలు కంటెంట్ పరంగా మెప్పించినా? ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించడానికి కనీసం అప్ కమింగ్ హీరోలు కూడా ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ పక్కన కనిపిస్తే తమ మార్కెట్ పడిపోతుందనే పాతకాలపు ఆలోచనల నుంచి పరిశ్రమ బయటకు రావాలని ఆమె డిమాండ్ చేసింది. కేవలం హీరో సెంట్రిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే ధోరణి మారాలంది. కథను జెన్యూన్ గా ప్రేమించే నటులు ఉంటేనే వైవిధ్యమైన సినిమాలు వస్తాయని ఆమె అభిప్రాయపడింది.
నటీనటుల మధ్య పారితోషికాల విషయంలోనే కాకుండా, సెట్స్‌లో ఇచ్చే గౌరవం , పాత్రల ప్రాధాన్యతలోనూ తీవ్ర వివక్ష ఉందని తాప్సీ ఆరోపించింది. సినిమా అనేది టీమ్ వర్క్ అని, కథ డిమాండ్ మేరకు ఎవరి పాత్రకైనా ప్రాధాన్యత ఉండవచ్చనే వాస్తవాన్ని హీరోలు గుర్తించాలని ఆమె కోరింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన పాత్రలు చేయాలనుకునే హీరోయిన్లకు హీరోల నుంచి సహకారం అందకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. మరి వీటిపై స్టార్ హీరోలు స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.