బాలీవుడ్ బోల్డ్ బ్యూటిఫుల్ నటి భూమి పెడ్నేకర్ తన కెరీర్ విషయంలో తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం గ్లామర్ పాత్రలకో, భారీ రెమ్యునరేషన్లకో ఆశపడకుండా, తన ఆలోచనా దృక్పథానికి , ఆత్మగౌరవానికి విరుద్ధంగా ఉన్న సుమారు 400 కోట్ల రూపాయల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులను అమ్మడు నిరభ్యంతరంగా వదులుకున్నట్లు వెల్లడించింది. ఒక నటిగా తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఏ సినిమా చేయనని తెగేసి చెప్పడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఆమె వదులుకున్న ఆ సినిమాల్లో మహిళా పాత్రలను కించపరిచేలా లేదా కేవలం ఆటబొమ్మల్లా చూపించే సన్నివేశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. `డబ్బు కంటే నా మనస్సాక్షికి నచ్చిన పని చేయడమే నాకు ముఖ్యం. మహిళలను తక్కువ చేసి చూపే ఏ కథలోనూ నేను భాగం కాలేను` అని భూమి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లినప్పటికీ, ఒక నటిగా తన గౌరవాన్ని కాపాడుకున్నందుకు ఆమె గర్వంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతటి భారీ ఆఫర్లను కాదనుకోవడం సామాన్యమైన విషయం కాదు.
భూమి పెడ్నేకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆమె, రాబోయే రోజుల్లో మరిన్ని పవర్‌ఫుల్ పాత్రలతో అలరించబోతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల కంటే బలమైన సందేశం ఉన్న కథలకే పెద్ద పీట వేయబోతుంది. 400 కోట్లు వదులుకున్నా సరే తన స్టాండ్ విషయంలో ఆమె తగ్గేదే లేదంటున్నారు. అయితే నటిగా కెరీర్ ఆరంభంలో మాత్రం చాలా బోల్డ్ పాత్రలు పోషించింది. వాటితోనే భూమీ బాలీవుడ్లో ఫేమస్ అయింది.