Advertisement
Google Ads BL

AP టాలీవుడ్‌పై చంద్ర‌బాబు క్లారిటీ


ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రలో సొంత సినీ పరిశ్రమ ఏర్పాటు అనేది ఒక తీరని కలగా మిగిలిపోయింది. సినీ తారలు, నిర్మాతలు ప్రతిసారీ ఏపీలో సినీ పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వం కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని చాలా మంది అమ‌రావ‌తికి వెళ్లి మ‌రీ అభ్య‌ర్థించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన మాత్రం `ఇదిగో పులి అంటే అదిగో మేక` అన్న చందంగానే సాగుతోంది. రాజధాని అమరావతిలో అన్ని రకాల పరిశ్రమలకు చోటు కల్పిస్తున్న తరుణంలో అక్కడ వినోద పరిశ్రమకు ఎందుకు పెద్దపీట వేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటుపై కేవలం మాటలు తప్ప ఆచరణలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఈ విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుతో పోలుస్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరును ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి వంటి వారు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వినోద పరిశ్రమపై పక్కా క్లారిటీతో ఒక లక్ష్యంతో దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌ను కేవలం టాలీవుడ్‌గా మాత్రమే కాకుండా.. హాలీవుడ్ స్థాయిని మించి ఎదిగేలా చేస్తామని వరాల జల్లు కురిపిస్తున్నారు. షూటింగ్‌ల కోసం ప్రత్యేక వెసులుబాట్లు.. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ఆయనకు ఉన్న స్పష్టత ఏపీ నాయకత్వంలో లోపించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ - సినీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయనకు ఏపీలో మరో సినీ పరిశ్రమను నిర్మించాలనే ఆలోచన నిజంగా ఉందో లేదో అనేది ఒక ఫజిల్ లాగా మారింది. పారిశ్రామిక విధానాల్లో సినిమాను ఒక పారిశ్రామిక రంగంగా గుర్తించి ప్రోత్సహించే దిశగా బలమైన అడుగులు పడటం లేదు. తూతూ మంత్రం ప్రకటనలు చేయడం వల్ల ఫలితం ఉండదని సంబంధిత రంగానికి చెందిన పెద్ద‌లు భావిస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ ని అంతర్జాతీయ సినీహ‌బ్ గా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే, అస‌లు వినోద ప‌రిశ్ర‌మ‌ను పట్టించుకునే స్థితిలో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌ధాని నిర్మాణానికే అధిక ప్రాధాన్య‌త క‌నిపిస్తోంది. ఫార్మా, ఐటీ రంగాలలోకి పెట్టుబ‌డులు వ‌స్తున్నా... వినోద పరిశ్రమ మాత్రం వెనుకబడే ఉంది. ఇతర రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం కొంతైనా సినిమా రంగానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక కొత్త సినీ కేంద్రం వెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం క్లారిటీతో ఒక నిర్ణయం తీసుకుని అమరావతి లేదా విశాఖపట్నం వేదికగా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులు.. కానీ సినీప‌రిశ్ర‌మకు జీరో:

ఇటీవల విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సిఐఐ (CII) పారిశ్రామిక సదస్సులో ఏపీ ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దిక్కులా పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఫార్మా, ఐటీ.. ఐటీయేత‌ర పారిశ్రామిక రంగాలకు భారీ ప్రోత్సాహకాలు కల్పిస్తూ, భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.

అయితే ఇంత భారీ స్థాయిలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఎక్కడా కొత్త సినీ పరిశ్రమ గురించి కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వందలాది స్టాల్స్‌తో కళకళలాడిన ఈ సదస్సులో సినిమా రంగాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్క స్టాల్ కూడా కనిపించలేదు. ఏపీలో సినిమా షూటింగ్‌లకు కావాల్సిన వనరులు, లొకేషన్లు పుష్కలంగా ఉన్నా.. పరిశ్రమను ఒక వ్యవస్థాగత రూపంలోకి తెచ్చే ప్రయత్నం పారిశ్రామిక వేత్తల ముందు ప్రదర్శించకపోవడం ఆశ్చర్యం క‌లిగించింది. ఐటీ ఇండ‌స్ట్రీకి ధీటుగా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ విస్త‌రించి ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచ యాత్రికులు, బిజినెస్‌మేన్‌ల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. అలాంటి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీని ఏపీకి తీసుకుని రావ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అల‌స‌త్వాన్ని నెటిజ‌నులు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.  

క‌నీసం ప‌న్నుల ఆదాయంపైనా ఆశ లేదు:

గ‌ద్ద‌ర్ అవార్డ్స్ -2026 వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తావిస్తూ.. అక్కడ కళాకారులను గౌరవించే విషయంలో.. సినిమా రంగాన్ని ఉత్సాహపరిచే విధానంలో ప్ర‌భుత్వం కొంత `వెనకంజ` వేసింద‌ని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్లకు అత్యంత ఆప్తులు.. సినిమా రంగంపై అవగాహన ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్ర‌యోజ‌నం లేద‌ని గుర్తు చేసారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను.. ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకి చిరంజీవి విన్నవించారు. ఏపీ ప్రభుత్వం కూడా సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే.. ఎంతో మంది యంగ్ స్టర్స్ ముందుకు వచ్చి మరిన్ని మంచి సినిమాలు చేస్తారని.. తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో తోడ్పడుతుందని ఆయన సూచించారు. క‌నీసం వినోద రంగం నుంచి వంద‌ల కోట్ల ప‌న్నుల ఆదాయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ర‌ప్పించాల‌నే ఆలోచ‌న కూడా ప్ర‌భుత్వంలో క‌నిపించ‌లేద‌ని ప‌రోక్షంగా చిరు విమ‌ర్శించారు.

క‌నీసం ఈ వేస‌విలో అయినా ఏపీలో కొత్త‌ సినీపరిశ్ర‌మ గురించిన చ‌ర్చ ప్ర‌భుత్వంలో మొద‌ల‌వుతుంద‌ని స్థానిక‌ సినీఔత్సాహికులు ఆశిస్తున్నారు.

Nara Chandrababu Naidu:

Tollywood-Nara Chandrababu Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs