అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన ఆస్తి వివాదం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. చెంగల్పట్టు జిల్లాలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు సమీపంలో ఉన్న సుమారు 4.7 ఎకరాల విలువైన స్థలం విషయంలో బోనీ కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 1988లోనే శ్రీదేవి అన్ని చట్టబద్ధమైన ఆధారాలతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినప్పటికీ, తాజాగా మొదలియార్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు తామే అసలైన వారసులమంటూ సివిల్ దావా వేయడంతో వివాదం మొదలైంది.
ప్రస్తుతం ఈ కేసు చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతోంది. అయితే కావాలనే ఈ వివాదాన్ని సాగదీస్తున్నారని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందున అక్రమ దావాను వెంటనే కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లతో కలిసి హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఆస్తి హక్కులను కాపాడుకోవడానికి వారు చేస్తోన్న పోరాటం ఇప్పుడు న్యాయస్థానంలో కీలక దశకు చేరుకుంది.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్‌సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి చర్యలపై మార్చి 26 వరకు స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 26న జరగబోయే పూర్తి స్థాయి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్నది? ఆసక్తికరంగా మారింది. శ్రీదేవి వారసులకు ఈ ఆస్తి వివాదం నుంచి ఊరట లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.