మెగా ఫ్యామిలీలో అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుణ్ తేజ్ - నిహారిక కొణిదెల మధ్య ఉన్న బాండింగ్ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా వీరిద్దరూ వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన జీవితంలోకి ఈ అనుబంధాన్ని తీసుకువస్తున్నారు. నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక వాలీబాల్ ప్లేయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే గని సినిమా కోసం బాక్సర్‌గా మారి తన బాడీని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్న వరుణ్ ఇప్పుడు వాలీబాల్ క్రీడాకారుడిగా మరో భిన్నమైన మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా వాలీబాల్ కోచ్‌ల వద్ద శిక్షణ కూడా తీసుకోనున్నట్లు సమాచారం. ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం నిహారిక నిర్మాణంలో వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలను నిర్మించి నిర్మాతగా సత్తా చాటుకున్నారు. ఇప్పుడు తన అన్నయ్యతో ఒక ప్రెస్టీజియస్ మూవీని ప్లాన్ చేయడం ద్వారా పెద్ద సినిమాల నిర్మాణంలోకి కూడా అడుగు పెడుతున్నారు. అన్నయ్య వరుణ్ తేజ్ మార్కెట్‌కు తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ కథ సాగనుంది. ఈ చిత్రాన్ని కమిటీ కుర్రాళ్లు ఫేం యదు వంశీ తెరుకెక్కించనున్నాడు.