ఒక దేశాధ్యక్షుడు ఫలానా సినిమా చూసి ఇండియాకు బయల్దేరాను! అని మీడియా ఎదుట వ్యాఖ్యానించారంటే, గ్లోబల్ వరల్డ్ లో భారతీయ సినిమా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా హవా స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇంతకుముందు తొలి ఆస్కార్ అవార్డ్ అందుకున్న భారతదేశం వినోద రంగంలో ఉవ్వెత్తున తరంగంలా దూసుకెళుతుంటే దానిని ప్రపంచ దేశాలు తీక్షణంగా చూస్తున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ ఖ్యాతి తర్వాత మళ్లీ దురంధర్ పై విదేశీ ప్రముఖుల దృష్టి అంతే ఇదిగా ఉంది. పాకిస్తాన్, గల్ఫ్ లో నిషేధం కారణంగా, పైరసీలో అత్యధికంగా డౌన్ లోడ్ చేసి చూసిన సినిమాగాను దురంధర్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. దీని అర్థం ఆయా దేశాల అధ్యక్షులు కూడా ఈ సినిమాలో ఏం ఉందో చూడాలన్న కుతూహాలం కలిగి ఉన్నారనే.. మొత్తానికి ఫిన్ లాండ్ దేశాధ్యక్షుడు భారత పర్యటనకు బయల్దేరే ముందే దురంధర్ సినిమా చూసారు. తన కొడుకు సలహాను పాటించారు. ఇది వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ!
ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ దురంధర్ సినిమాను చూసి ప్రశంసించడం, ఆ సినిమా సీక్వెల్ కూడా చూస్తానని అనడం హాట్ టాపిగ్గా మారింది. సినిమాలో ఉగ్రవాదంపై పోరాడే కథాంశం తనకు బాగా నచ్చిందని, ఆ పోరాటానికి తన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మార్చి 19న విడుదల కానున్న సీక్వెల్ దురంధర్: ది రివెంజ్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్టబ్ తెలిపారు.