ఒకప్పుడు సినిమా అంటే రెండున్నర గంటలు.. మహా అయితే రెండు గంటల నలభై నిమిషాలు. అంతకు మించి నిడివి ఉంటే ప్రేక్షకులు థియేటర్లలో కూర్చోలేరని, బోర్ ఫీల్ అవుతారని మేకర్స్ భయపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మూడు గంటల సినిమా అనేది సర్వసాధారణం అయిపోయింది. విడుదలకు సిద్ధమవుతున్న దురంధర్ 2, టాక్సిక్ సినిమాలు రన్ టైమ్ విషయంలో ఏకంగా చరిత్రను తిరగరాస్తున్నాయి.
బాలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `దురంధర్ 2` రన్ టైమ్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా ఏకంగా 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో విడుదల కానుంది. అంటే ఒక ప్రేక్షకుడు ఈ సినిమా చూడాలంటే ఇంటి నుంచి థియేటర్‌కు వెళ్లి వచ్చేసరికి దాదాపు 4 గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. గతంలో వచ్చిన దురంధర్ మొదటి భాగం కూడా 3 గంటల 34 నిమిషాల నిడివితో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పార్ట్ 2 ఆ రికార్డును కూడా చెరిపేస్తోంది.
ఇటు రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న `టాక్సిక్` కూడా రన్ టైమ్ విషయంలో సర్ప్రైజ్ చేస్తోంది. మొదట్లో ఈ సినిమా కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని ప్రచారం జరిగినా కానీ, తాజా సమాచారం ప్రకారం ఇది 3 గంటల 20 నిమిషాల (దాదాపు 200 నిమిషాలు) నిడివితో రానుంది. దురంధర్ 2 కంటే ఇది 20 నిమిషాలు తక్కువైనా కానీ, ఒక కన్నడ సినిమాకు ఇది భారీ రన్ టైమ్ అని చెప్పాలి.
రన్ టైమ్ విషయంలో మేకర్స్‌లో ఈ స్థాయి కాన్ఫిడెన్స్ రావడానికి 2023లో వచ్చిన `యానిమల్` సినిమానే ప్రధాన కారణం. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ఇటీవల వచ్చిన `బోర్డర్ 2` కూడా 3 గంటల 19 నిమిషాల నిడివితో సక్సెస్ అయింది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఎంత సేపైనా థియేటర్లలో కూర్చుంటారని ఈ సినిమాలు నిరూపించాయి.