తెలుగింట భోజనంలో పప్పు టమోటో ఒక ఎమోషన్. ఎన్ని రకాల కూరలు ఉన్నా, అవి వెజ్ అయినా? నాన్ వెజ్ అయినా? పప్పు తప్పనిసరిగా భావిస్తారు. పప్పును ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. మరి ఇదే పప్పు ను అమితంగా ఇష్టపడే సెలబ్రిటీలు ఎవరు? అంటే ప్రముఖంగా వీరిని చెప్పొచ్చు. బాలయ్య బాబుకు పప్పు అంటే చాలా ఇష్టం.ఆయన భోజనంలో పప్పు, ఆవకాయ లేదా పప్పు, వెల్లుల్లి కారం ఉండాల్సిందేనని ఇండస్ట్రీలో అంతా చెబుతుంటారు.
షూటింగ్ స్పాట్‌లో కూడా ఆయన ఇంటి నుండి వచ్చిన పప్పును ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా గొప్ప వంటగాడు. నాన్ వెజ్..బిర్యానీ వంటలు చేయడంలో స్పెషలిస్ట్. ఇక వెజ్ లో తారక్ ఇష్టపడే వంటకం పప్పు టమోటో. అత్యంత ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పప్పు-అన్నం మాత్రమే అంటారు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి అత్యంత ఇష్టమైన ఆహారం పప్పు-చావల్. వయసు రీత్యా ఆయన చాలా సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. పప్పును పల్చగా చేసుకుని అన్నంలో కలుపుకుని తినడం ఎంతో ఇష్టం.
సూపర్ స్టార్ మహేష్ స్ట్రిక్ట్ డైట్ పాటిస్తారు. కానీ పప్పు - వేయించిన కూరగాయలు కాంబి నేషన్ అంటే ఎంతో ఇష్టం.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ప్రతిరోజూ పప్పు-అన్నం తిన్నా అస్సలు బోర్ కొట్టదంటారు. అది తన ఫేవరెట్ ఫుడ్. అలాగే అలియాభట్ పక్కా పప్పు-అన్నం ప్రియురాలు. షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినా, అక్కడ పప్పు దొరికితే ఆమెకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. సర ళమైన జీవితాన్ని ఇష్టపడే సాయి పల్లవికి ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఆమె కూడా పప్పును ఎక్కువగా ఇష్టపడే సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు.