టాలీవుడ్ అగ్ర నిర్మాత, బిజినెస్ స్ట్రాటజిస్ట్ అల్లు అరవింద్ ప్రారంభించిన `ఆహా` తెలుగు ఓటీటీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పేయడం అంత సులువు కాదు. ఎందుకంటే బాస్ అల్లు అరవింద్ మైండ్ లో ఏం ఉందో ఎవరైనా ఊహించడం అంత ఈజీ కాదు. ప్రతి 100 సంపాదించడం కోసం ఆహా మేకర్స్ ఏకంగా 160 ఖర్చు చేస్తున్నారు. దీని అర్థం ఆహా ఓటీటీ నష్టాల్లో ఉందనే. దీనిపై ఇటీవల మీడియాలో చాలా కథనాలొచ్చాయి.
అయితే ఆహా ఓటిటి - బిజినెస్ తీరును కేస్ స్టడీగా పరిశీలిస్తే... ఇదేమీ ఆషామాషీ ప్లాన్ కాదని అర్థం చేసుకోవాలి. 2020 ఫిబ్రవరి 8న అల్లు అరవింద్ `ఆహా` ఓటీటీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన జీవితంలో తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. అప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఉన్నా, కేవలం తెలుగు నేటివిటీని నమ్ముకుని ఆయన ఈ సాహసం చేశారు.
ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే `ఆహా` సుమారు 60 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇందులో ప్రధానంగా రెండు సంస్థలు ఉన్నాయి. ఒకటి అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్, రెండోది జూపల్లి రామేశ్వరరావు మై హోమ్ గ్రూప్. మై హోమ్ గ్రూప్ సుమారు 300 కోట్లు కాగా, అల్లు అరవింద్ తన కంటెంట్ లైబ్రరీతో పాటు సుమారు 100 కోట్ల నగదు పెట్టుబడిగా పెట్టారు. అల్లు అర్జున్ ఈ సంస్థకు కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, ఒక క్రియేటివ్ పార్టనర్ కం స్టేక్ హోల్డర్ కూడా.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆహా రెవెన్యూ 150-200 కోట్ల మధ్య ఉండగా.. ఖర్చులు 300 కోట్లు దాటాయి. అంటే సుమారు 100 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఏదైనా వ్యాపారం ప్రారంభించగానే లాభాలు కావాలనుకుంటే రావు కదా! ఆహా కూడా అంతే. మొత్తం ఖర్చుల్లో 60శాతం కంటెంట్ కొనుగోలుకు.. 15 శాతం టెక్నాలజీ (AWS క్లౌడ్) కి, 25 శాతం మార్కెటింగ్ కోసం వెచ్చిస్తున్నారు.
సంపాదిస్తున్న ప్రతి 100 రూపాయలకు 160 రూపాయలు ఖర్చు చేయడం అనేది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ. అయితే అప్పుడే అన్‌స్టాపబుల్ షో మ్యాజిక్ మొదలైంది. మునిగిపోతున్న ఆహాను `అన్‌స్టాపబుల్ విత్ NBK` షో నిలబెట్టింది. బాలకృష్ణ క్రేజ్ వల్ల సబ్‌స్క్రిప్షన్లు భారీగా పెరిగాయి. బాలయ్య పారితోషికం మొదటి సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 25-40 లక్షలు తీసుకోగా, రెండో సీజన్ నుండి అది కోటి రూపాయలకు పైగా పెరిగిందని అంచనా. ఒక్కో సీజన్ నిర్మాణానికి (సెట్స్, లైటింగ్, గెస్ట్‌లు) సుమారు 20 నుండి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ షో వల్ల సుమారు 15 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. తద్వారా 60 కోట్ల రూపాయల రెవెన్యూ కేవలం సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే వచ్చింది. సబ్‌స్క్రిప్షన్ల కంటే స్పాన్సర్‌షిప్ ద్వారా ఆహాకు ఎక్కువ లాభం వస్తోంది. ఒక్కో సీజన్‌కు మేజర్ స్పాన్సర్లు 2-5 కోట్లు ఇస్తున్నారు.
షో ఉన్నప్పుడు సబ్‌స్క్రైబ్ అయ్యి, షో అయిపోగానే రిన్యూవల్ చేసుకోకపోవడాన్ని `చర్న్ రేట్` అంటారు. దీన్ని తగ్గించడానికి ఇండియన్ ఐడల్ వంటి షోలను తెచ్చారు. యూజర్లు ఏ హీరోను ఇష్టపడుతున్నారు, ఎలాంటి జోకులు ఎంజాయ్ చేస్తున్నారు అనే డేటాను సేకరించి భవిష్యత్తు ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. దీనిని డేటా డ్రివెన్ కంటెంట్ అంటారు. ఒక యూజర్‌ను సంపాదించడానికి ఆహా 300 రూపాయలు ఖర్చు చేస్తోంది, కానీ యూజర్ కట్టేది 399 మాత్రమే. ఆ యూజర్ 2-3 ఏళ్లు కొనసాగితేనే లాభం వస్తుంది. ఆహా తమిళం ద్వారా తన మార్కెట్ పరిధిని రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఎగ్జిట్ స్ట్రాటజీ:
అల్లు అరవింద్ అసలు ప్లాన్ ఆహాను ఐపీఓ (IPO) కి తీసుకెళ్లడం లేదా రిలయన్స్ జియో వంటి పెద్ద కంపెనీలకు భారీ ధరకి వాటాలను అమ్మడం అని కూడా ఇండస్ట్రీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న 100 కోట్ల నష్టం అనేది భవిష్యత్తులో వేల కోట్ల లాభాల కోసం వేసిన పునాదిగా చూడాలనేది ఒక విశ్లేషణ. 2026 చివరి నాటికి ఖర్చు తగ్గించి, ఆదాయం పెంచి లాభాల్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అల్లు అరవింద్ - మై హోమ్ గ్రూప్ కలిసి తెలుగు డిజిటల్ మార్కెట్‌ను శాసించేలా ఒక బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత నష్టం అనేది వారి దీర్ఘకాలిక వ్యాపార వ్యూహంలో ఒక భాగం మాత్రమేనని విశ్లేషిస్తున్నారు.