హీరో రానా గతంలోలా వరసగా సినిమాలు చెయ్యడం లేదు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. రానా ఎక్కువగా వెండితెరపై కనిపించకపోవడంపై చాలామంది డిజప్పాయింట్ అవుతున్నారు. బాహుబలిలో భల్లాల దేవుడిగా, నేనే రాజు నేనే మంత్రి లో హీరోగా రానాను ఇష్టపడిన ప్రేక్షకులు ఇప్పుడు రానాను చాలా మిస్ అవుతున్నారు.
తాజాగా రానా ప్రశాంత్ వర్మ-రిషబ్ శెట్టి కలయికలో తెరకెక్కబోయే జై హనుమాన్ లో కీ రోల్ పోషిస్తున్నారని టాక్ ఉంది. అయితే రానా గతంలో కిడ్నీ సమస్యతో పోరాడి అమెరికా వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి వచ్చాడు. అలాగే రానా కు కంటి సమస్య కూడా ఉంది. తాజాగా రానా హెల్త్ ఇష్యుతో ఎంత సఫర్ అయ్యాడో అనేది ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
కిడ్నీ సమస్యలు సీరియస్ అవడంతో ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన రానా.. అప్పుడు తన ముందు ఉన్న ఏకైక లక్ష్యం బతకడం మాత్రమే అని.. సినిమా, కెరీర్ గురించి ఆలోచించే పరిస్థితిలో తాను లేను అని చెప్పాడు. ఏడాది పాటు యుఎస్ లోనే ఉంది చికిత్స తీసుకున్న తాను ఇండియాకి తిరిగొచ్చాక అద్దంలో తనని తాను చూసుకుని మానసికంగా కృంగిపోయినట్లుగా చెప్పాడు, అంతలా తన రూపు రేఖలు మారిపోయాయని చెప్పాడు.
తాను అమెరికా కిడ్నీ ఆపరేషన్ కోసం వెళ్ళకముందు ఒప్పుకున్న సినిమాలన్ని వదులుకున్నాను అని, అప్పటికే తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు గా రానా చెప్పుకొచ్చాడు. తనను పరామర్శించడానికి వచ్చిన వరుణ్ తేజ్ ని చూసి తనలాగే ఉన్నాడు అనుకున్నాను అని, తాను చెయ్యాల్సిన ప్రాజెక్ట్స్ వరుణ్ కి ఇచ్చేద్దామని అనుకున్నట్లుగా రానా తన హెల్త్ విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.