మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తీవ్ర ఆవేదన ఇప్పుడు చర్చగా మారింది. అతడు భారతదేశంలో ఎగ్జిబిషన్ (థియేటర్ల) రంగం ఎలా వెనకబడి ఉందో వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. చైనాలో ఏకంగా 85,000 నుంచి 90,000 థియేటర్లు ఉంటే, మన దేశంలో కేవలం 10,000 లోపు థియేటర్లు ఉన్నాయని అన్నారు. దీని వల్ల భారతదేశంలోని మూలమూలల్లోని ప్రజలకు వినోదం అందడం లేదని, సినీపరిశ్రమ వెనకబాటునకు ఇది ఒక కారణమని విశ్లేషించారు. మన దేశంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నా కానీ, వారికి థియేటర్లు అందుబాటులో లేవని అన్నారు.
థియేటర్లు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే అంతగా ప్రజలు సినిమాలు చూస్తారని అన్నారు. దురంధర్ లాంటి సినిమా 15,000 థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే ఇంకా ఎంత వసూలు చేసేదో ఊహించగలరా? అని కూడా అమీర్ ఖాన్ ప్రశ్నించారు. మొత్తానికి భారతదేశంలో థియేట్రికల్ రంగం ఎంతగా వెనకబడిందో ఆయన మాటలు స్పష్ఠం చేస్తున్నాయి. అలాగే అమెరికాతో పోలిస్తే ఇతర అన్ని దేశాల్లో థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. అక్కడ జనాభా ధామాషా ప్రకారం చూస్తే, థియేటర్లు చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి చైనా తరహాలో వేలాదిగా థియేటర్ల అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది.
గతంలో అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీలు థియేట్రికల్ రంగాన్ని నాశనం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రజలు థియేటర్లలో మాత్రమే సినిమాలు చూడాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోనే సినిమా అందుబాటులోకి వచ్చేయడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. ఓటీటీలకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉందని కూడా అమీర్ అభిప్రాయపడ్డారు. ఓటీటీ రంగంపై సినిమా రంగం ఆధారపడకూడదని కూడా అభిప్రాయపడ్డారు.