బెంగళూరులో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటి) దాడులు జరుగుతున్న సమయంలో కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత డాక్టర్ చిరియంకండత్ జోసెఫ్ రాయ్ తన కార్యాలయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వ్యాపార, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఐటీ అధికారులు గత మూడు రోజులుగా బెంగళూరులోని ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరుగుతున్న సమయంలోనే, రాయ్ తన గదిలోకి వెళ్లి లైసెన్స్‌డ్ తుపాకీతో తలపై కాల్చుకున్నారు.
తీవ్ర రక్తస్రావమైన రాయ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. యల్ ఎస్టేట్ రంగంలో కాన్ఫిడెంట్ గ్రూప్ ద్వారా వేల కోట్ల వ్యాపారాన్ని ఆయన నిర్మించారు. బెంగళూరు, కేరళతో పాటు దుబాయ్‌లో కూడా ఈ సంస్థకు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన `కాసనోవా`, `మరక్కార్` వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. బిగ్ బాస్ మలయాళం, కన్నడ షోలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడం ద్వారా ఆయన సాధారణ ప్రజల్లో కూడా గుర్తింపు పొందారు.
ఈ ఘటన 2019లో జరిగిన కాఫీ డే (సీసీడీ) యజమాని సిద్ధార్థ ఆత్మహత్యను గుర్తు చేస్తోంది. సిద్ధార్థ కూడా ఐటీ అధికారుల వేధింపులు, అప్పుల ఒత్తిడి కారణంగానే ప్రాణాలు తీసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సి.జె. రాయ్ విషయంలో కూడా ఐటీ దాడుల సమయంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.