సినీ పరిశ్రమలో ఏ అవకాశం ఎప్పుడు ఎలా వరిస్తుందో.. ఎవరూ చెప్పలేరు. ఒకే ఒక్క ఛాన్స్ కెరీర్ ని, లైఫ్ దశ దిశను మార్చేస్తుంది. స్టార్ స్టాటస్‌ని కూడా అందుకోవచ్చు. నేటి జెన్ జెడ్ దర్శకులు ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ విజయంతో 10కోట్ల రేంజు పారితోషికాలు అందుకుంటున్నారంటే, క్రియేటివిటీ రంగంలో గేమ్ ఛేంజింగ్ ఆఫర్ కోసం పోటీ ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. అయితే ఈ రంగంలో కొన్నిసార్లు అవకాశం చిక్కినట్టే చిక్కి ఛేజారుతుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ బాధ వర్ణనాతీతం.
తనకు కింగ్ నాగార్జున అంత పెద్ద స్టార్ స్వయంగా ఆఫర్ ఇచ్చారు. దర్శకుడిగా కథను ఫైనల్ చేసారు. కానీ ఒక పెద్ద దర్శకుడు దానిని నాశనం చేసాడని ఆవేదన చెందారు నటుడు, దర్శకుడు కాదంబరి కిరణ్. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని నాగార్జునకు వినిపించగా అది ఆయనకు నచ్చింది. పదిహేను మంది హేమాహేమీల సమక్షంలో ప్రాజెక్టును ప్రారంభిస్తానని నాగార్జున తనకు ప్రామిస్ చేసారు. సినిమా టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నావ్? అని కూడా అన్నారు. `బావ` అనే టైటిల్ కూడా ఎంపిక చేసుకున్నానని చెప్పగానే అందరూ ప్రశంసించారని కాదంబరి తెలిపారు.
కట్ చేస్తే ఒక రోజు తర్వాత సీన్ మారిపోయింది! ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ అవకాశం ఛేజారింది. అయితే నాగార్జున కాంపౌండ్ లోనే కాదు, అందరూ హీరోల దగ్గర చాలా స్క్రిప్టులు ఇలానే ఆచేతన దశలోనే మగ్గిపోతూ ఉంటాయి. దర్శకరచయితలు ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. కొందరికి ఏళ్లకు ఏళ్లు పట్టేస్తుంటే, మరికొందరికి తల వెంట్రుకలు నెరిసిపోయి, జీవితం కూడా అయిపోతుంది. కాదంబరి సీనియర్ నటుడిగా టాలీవుడ్ లో వంద పైగా చిత్రాలలో నటించేశారు. కానీ దర్శకుడిగా ఎదగాలన్న కల మాత్రం నెరవేరలేదు. ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తెలుగు సినిమా కార్మికులు, ఆపన్నులకు కష్ట కాలంలో సాయమందిస్తున్నారు. అయినా విధి ఇలా రాసి ఉంటే ఎవరేమి చేయగలరు? అని కాదంబరి కూడా అంగీకరించారు.