దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `జన నాయగన్` విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా సెన్సార్ షిప్ జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడటంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. దీంతో తదుపరి రిలీజ్ తేది ఎప్పుడొస్తుదా? అన.ఇ అభిమానులు సహా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ పై కొత్త సమాచారం అందుతోంది.
ఫిబ్రవరిలో కేవలం మూడు తేదీలు (జనవరి 30, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 13) మాత్రమే థియేటర్ల విడుదలకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ తేదీలను కూడా మిస్ అయితే, ఎన్నికల నిబంధనల దృష్ట్యా ఈ చిత్రం జూన్ తర్వాతే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్ర బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అనిశ్చితి మరింత పెరిగింది.
ఈ వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాలని న్యాయమూర్తులు సూచించడంతో తక్షణ క్లియరెన్స్ లభిస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయినప్పటికీ, ఫిబ్రవరిలోనే సినిమా విడుదలవుతుందని కొంత మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరులోపు సర్టిఫికేషన్ సమస్యలు పరిష్కారమవుతాయని వారు నమ్ముతున్నారు. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.