తాను ఏం మాట్లాడాలనుకున్నా ముక్కుసూటిగా మాట్లాడటం, ఎటాక్ చేయడం కంగన స్టైల్. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదిగిన కంగన, ఇటీవల రాజకీయాల్లో ప్రవేశించి భాజపా తరపున ఎంపీగాను ప్రజా సేవలో ఉన్నారు. ఎంపీ అయ్యాక కంగన ఊపిరాడనివ్వనన్ని వివాదాల్లో చిక్కుకోవడం చర్చగా మారింది. నోటిమాటతోనే కంగన అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
ఇప్పుడు స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ పై కంగన ఘాటు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్వరమాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ గుడ్డివాడు..! అంటూ కంగన చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలలో మీమ్ ఫెస్టివల్ గా మారుతోంది. అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. తన మతం (ముస్లిమ్) కారణంగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు. తద్వారా సినీపరిశ్రమలో మత వివక్ష ఉందంటూ వాదించాడు. అయితే దీనిపై భాజపా నాయకులు చాలా మంది కౌంటర్లు వేస్తున్నారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లను అగ్ర హీరోలుగా నిలబెట్టిన దేశంలో ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని చాలా మంది రాజకీయ నాయకులు కౌంటర్ వేసారు.
కంగన ఈ సందర్భంలోనే రెహమాన్ కి కౌంటర్ గా మాట్లాడుతూ.. తన సినిమా ఎమర్జెన్సీ(ఇందిరాగాంధీ బయోపిక్) కి సంగీతం అందించాల్సిందిగా రెహమాన్ ని సంప్రదిస్తే, తనను కలిసేందుకు కూడా నిరాకరించాడని అన్నారు. ఇది ప్రొపగండా సినిమా...అని తనను దూరం పెట్టాడని కూడా కంగన ఘాటు విమర్శలు చేసారు. కానీ ఆ తర్వాత ఎమర్జెన్సీ చిత్రాన్ని మాస్టర్ పీస్ అంటూ విమర్శకులు ప్రశంసించారని, రెహమాన్ గుడ్డివాడయ్యాడని కూడా కంగన ఎటాక్ చేసారు. అయితే దీనిపై రెహమాన్ ఇంకా స్పందించాల్సి ఉంది.