దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి..! క్రేజ్ ఉన్నప్పుడు సంపాదించాలి. సంపాదించినది లాభదాయకమైన పెట్టుబడిగా మార్చాలి. చాలామంది ఆ మూడో విభాగంలో ఫెయిలవుతుంటారు. కానీ కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు తమ సంపాదనను తెలివైన పెట్టుబడులుగా మారుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పెట్టుబడిపై నాలుగేళ్లలో 10రెట్లు అదనంగా ఆర్జించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడి మేధోతనానికి, పెట్టుబడుల పరంగా అద్భుత ప్రణాళికకు అందరూ షాకయ్యారు. రెండు ఫ్లాట్లను తక్కువ ధరకు కొని, నాలుగేళ్లలో పదింతలు లాభాలార్జించిన ఘనత అమితాబ్ కే సాధ్యం. ఇలాంటిది అందరికీ వర్కవుట్ కాకపోయినా కొందరు తక్కువ సమయంలో రెట్టింపు లాభం అందుకున్న సందర్భాలున్నాయి.
ఇప్పుడు ముంబై అలీభాగ్ ఏరియా (జిరాద్ అనే చోట )లో సెలబ్రిటీలు నివశించే చోట ఏకంగా 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేసారు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు. దీనికోసం ఏకంగా 37.86 కోట్ల పెట్టుబడిని పెట్టారు. రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చయింది.
అలీభాగ్ లో మూడేళ్ల క్రితం 8 ఎకరాల భూమిని 19కోట్లతో కొనుగోలు చేసిన విరుష్కకు ఈ ప్రాంతంలో ఇది రెండో పెట్టుబడి. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వంటి ప్రముఖులకు సొంత అపార్ట్ మెంట్లు ఉన్న ఈ ప్రాంతంలో భూమి కొనుగోలును చాలామంది క్రేజీగా భావిస్తారు. ఇప్పుడు ఏకంగా 60కోట్లు కేవలం అలీభాగ్ ప్రాంతంలోని భూమిపై పెట్టింది విరుష్క.