హైదరాబాద్, జనవరి 14: పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారనేది రెండున్నర దశాబ్దాలుగా శ్రీనివాస్ అమోఘ కృషితో అందించిన గ్రంధాలకు వేల వేల పూజా పీఠాలే సాక్షి.
శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారునిగా భక్తి పారవశ్యపు సేవలందించిన శ్రీనివాస్ అపూర్వ రచనలు, సంకలనాలు ఈ దేశపు ఎల్లలుదాటి అనేక దేశాల్లో తెలుగువారిని భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతున్నాయని మేధోసమాజం అనేక సందర్భాల్లో కోడై కోసింది కూడా!
మహాసరస్వతీదేవి శ్రీ చరణాల చెంత మంత్రముగ్ధమైన అమృతరసధారల్లాంటి పవిత్ర గ్రంధాల వెలుగులు నిరంతరం నిరంతరాయంగా పొంగిస్తున్న పుస్తకమాంత్రికునిగా విశేషఖ్యాతి పొందిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఆర్ష భారతీయ వైభవ గ్రంధాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదనేది జగమెరిగిన సత్యం.
అపురూప కవిత్వ పుష్ఠితో, అద్భుతమైన ఆర్ష సంస్కృతానురక్తితో, మాటల్లో మార్దవంతో, కంఠంలో వైదిక వైదుష్యంతో ఎన్నో ఎన్నెన్నో సభల్లో, ఇంకా ఎన్నెన్నో అమోఘ గ్రంధాలతో బ్రహ్మానందం వైపు, జ్ఞానానందం వైపు అప్రతిహతంగా నిస్వార్ధంతో సాగుతున్న పురాణపండ శ్రీనివాస్ వచ్చే శివరాత్రికి (Maha Shivaratri 2026) సుమారు ఐదువందలపేజీల శంభో మహాదేవ (Sambho Mahaadeva Book) అఖండ గ్రంధాన్ని విడుదల చేస్తున్నారు.
ఒక చోట పుస్తకం, మరొక చోట అద్భుత ప్రసంగం.. ఇలా సాగుతున్న శ్రీనివాస్ ప్రయాణంలో శ్రీ పూర్ణిమ, శ్రీమాలిక, నేనున్నాను, అమ్మణ్ణి అఖండ గ్రంధాలు సృష్టించిన సంచలనం సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక వేత్తలకు, భక్త పాఠకులకూ ఎరుకే!
అయితే.. త్వరలో ఆవిష్కరణ జరుపుకోనున్న శంభో మహాదేవ అఖండ గ్రంధాన్ని కాలభైరవ ప్రచురణల సంస్థ (Kaalabhairava Graphics) వారికి రైట్స్ ఇచ్చేసినట్లు సమాచారం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల ప్రముఖుల్లో ఎక్కువమంది ఆసక్తి చూపేది పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలవైపేనని గతంలో ప్రముఖ సినీ నటులు మాగంటి మురళీమోహన్ రవీంద్రభారతిలో ఒక సభలో స్పష్టం చేసిన విషయం విజ్ఞులకెరుకే! మురళీ మోహన్ పేర్కొన్న ఈ బలమైన వాక్యానికి నాటి సభలో ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి. రమణాచారే ప్రత్యక్ష సాక్షి.