సినీపరిశ్రమలో టికెట్ ధరల పెంపు అంశం ఎడతెగనిది. ఎప్పటికీ ఎండ్ లెస్ డిబేట్ గా మారింది. పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక, కేరళ ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరల్ని అదుపు తప్పకుండా నిలువరిస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపును ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు థియేటర్లకు రాకుండా ఇండస్ట్రీయే పొగ పెట్టుకుంటోందని గతంలో సీపీఐ నారాయణ ఘాటు విమర్శలు చేసారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ల పుట్టుకకు కారణం ఈ లోపాయికారీ వ్యవస్థ అని విమర్శించారు.
ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు టికెట్ ధరల పెంపునకు ఇరు తెలుగు రాష్ట్రాలు అనుమతులు మంజూరు చేయడంపై సీపీఐ నారాయణ విరుచుకుపడ్డారు. సినీనిర్మాతలకు సిగ్గు లేదని విమర్శించిన నారాయణ, ప్రభుత్వం బుద్ధి తక్కువ పని చేస్తోందని విరుచుకుపడ్డారు. సినీమాఫియా- ప్రభుత్వం కలిసి ప్రజల్ని లూటీ చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ధనవంతులను మరింత ధనవంతులను చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని విరుచుకుపడ్డారు. థియేటర్లకు నీళ్లు, స్నాక్స్ తీసుకెళ్లకుండా ఆపేస్తున్నారని, అధిక ధరలతో థియేటర్ లోపల అమ్మకాలు సాగిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మరోసారి విమర్శించారు.
కోట్లు పెట్టి సినిమాలు తీసి సామాన్య ప్రజలపై భారం మోపుతారా? అని కూడా సీపీఐ నారాయణ ప్రశ్నించారు. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ది రాజా సాబ్, మనశంకర వర ప్రసాద్ టికెట్ ధరల పెంపును ఆయన నిలదీసారు. ప్రభుత్వాలు తెలివితక్కువగా సినీమాపియాకు సహకరిస్తున్నాయని కూడా విమర్శించారు.