హిట్ మెషిన్ అనీల్ రావిపూడికి ఇంత వరకూ వైఫల్యం ఎదురవ్వలేదు. `పటాస్` నుంచి `సంక్రాంతి వస్తున్నాం` వరకూ అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. నిర్మాతలకు కోట్లలో లాభాలొచ్చాయి. 40-50 కోట్ల బడ్జెట్ లో నే సినిమాలు చేసి హిట్ ఇవ్వడం అన్నది అనీల్ ప్రత్యేకత. మరి అలాంటి హిట్ మెషిన్ ని పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసారా? అంటే అవుననే తెలుస్తోంది.
ఆ ఇద్దరు స్టార్ హీరోలకు అనీల్ కథలు చెప్పాడు. కానీ వాటిని తిరస్కరించారు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి కూడా ధృవీకరించాడు. అయితే ఈ రిజెక్షన్ అన్నది ఇప్పుడు కాదు. కొన్నేళ్ల క్రితమే జరిగింది. అప్పుడు తాను చెప్పిన కథలు వాళ్లకు నచ్చకపోవచ్చు లేదా? కనెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. తాను కొత్త వాడినని రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదా నమ్మకం కలిగి ఉండకపోవచ్చు అన్నాడు అనీల్.
తప్పకుండా వాళ్లిద్దరి ఇమేజ్ కు తగ్గ కథ తన దగ్గర రెడీగా ఉన్నప్పుడు మళ్లీ అప్రోచ్ అవుతానని ధీమా వ్యక్తం చేసాడు. `కథ చెప్పే అవకాశం నాకిచ్చారు. కానీ వాళ్ల దగ్గర నేనేంటో ప్రూవ్ చేసుకోలేదేమో . దాన్ని నా ఫెయిల్యూర్ గానే భావిస్తాను. ప్రస్తుతానికైతే కథలు సిద్దంగా లేవు. కానీ ఏ నిర్మాత ద్వారానైనా అవకాశం వస్తే దానికి తగ్గట్టు మెటీరిలైజ్ అయి చేసుకుని వెళ్తాను. టైమ్ రానప్పుడు అనుకున్నది ఏదీ ఎలా జరగదో? సమయం వచ్చినప్పుడు ఆగమన్నా ఆగదు` అని అన్నారు.