కేజీఎఫ్ యష్ నటించిన టాక్సిక్ 2026 మార్చిలో సంచలనాలు సృష్టించేందుకు థియేటర్లలోకి దూసుకొస్తోంది. ముఖ్యంగా మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ బో*ల్డ్ అండ్ వై*ల్డ్ సినిమాని తెరకెక్కించడం చర్చకు తావిస్తోంది. ఒకే ఒక్క టీజర్ టాక్సిక్ రేంజ్ ఏంటో చర్చించుకునేలా చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత బో*స్ట్ స్టైలిష్ యాక్షన్ టీజర్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెబ్ లో ఇది సునామీ సృష్టిస్తోంది.
ఇలాంటి సమయంలో గీతూమోహన్ ప్రతిభను ఆకాశానికెత్తేస్తూ, మగ దర్శకులకు చేతకాదు! అనే అర్థంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టాక్సిక్ టీజర్ జనవరి 8న విడుదలైంది. దేశవ్యాప్తంగా చర్చగా మారింది.
ఈ టీజర్ వీక్షించిన ఆర్జీవీ సిసలైన మహిళా సాధికారతకు నిదర్శనమని ప్రశంసించారు. మగ దర్శకులు ఎవరూ ఈమెతో పోటీపడలేరని గీతూకి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈమె ముందు మగ దర్శకులు చాలా తక్కువకి పడిపోయారని అన్నారు. గీతూ విజన్, మేకింగ్ శైలిపై ఆర్జీవీ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో దురంధర్ సినిమాపైనా, ఆ సినిమా దర్శకుడు ఆదిత్యాధర్ పైనా ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ దృష్టి ఇప్పుడు గీతూమోహన్ దాస్, ఆమె తీసిన టాక్సిక్ పైకి మళ్లింది. కార్ లో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ, అత్యంత భయానకంగా, వైల్డ్ గా శ్మశానంలో శత్రువుల(మాఫియా)ను బాంబ్ తో పేల్చేసే సీన్ ని గీతూ డిజైన్ చేసిన తీరు మోస్ట్ స్టైలిష్ విజువల్స్, యష్ లుక్ నిజంగా మతులు చెడగొడుతున్నాయి అంటున్నారు. ఇటీవలి కాలంలో మగ దర్శకులు తెరకెక్కించిన ఏ సినిమా టీజర్ ఇలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అందుకే ఒక రకంగా గీతూ మగ దర్శకులకు సవాల్ విసిరారు. టాక్సిక్ 19 మార్చి 2026న విడుదలవుతోంది.