ఏపీ లోను, తెలంగాణ లోను భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దర్శకనిర్మాతలు ప్రభుత్వాలను కోరడం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దర్శకనిర్మాతల కోసం టికెట్ రేట్లు పెంచడం చూస్తున్నాం, అయితే ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని చెప్పగా రాజాసాబ్, శంకర వరప్రసాద్ నిర్మాతలు కోర్టుకెళ్లారు. అక్కడ వారికి ఊరట లభించింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం రాజాసాబ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అది అలాంటి ఇలాంటి అవకాశం కాదు.. ఓ రేంజ్ లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం రాజసాబ్ మేకర్స్ కి అనుమతి ఇచ్చింది. జనవరి 8 నైట్ ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయం, ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షోలకు అనుమతి.
జనవరి 9 నుంచి10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ రేట్లు చూసి రాజసాబ్ ప్రీమియర్స్ చూడాలంటె సాధారణ ప్రేక్షకుడికి జేబు చిల్లు పడాల్సిందే. సరదాగా సినిమా చూడాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ నెటిజెన్ల కామెంట్లు పెడుతున్నారు.