మాస్ రాజా రవితేజ `రాజా ది గ్రేట్` లో అంధుడి పాత్రలో ఓ ప్రయోగం చేసి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కమర్శియల్ గా మంచి విజయం సాధించింది. కొడుకు తల్లి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ ని తనదైన ట్రీట్ మెంట్ తో అలరించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు రవితేజ అంధ పాత్రలో నటించడం ఏంటని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా విజయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
రవితేజ లాంటి స్టార్ తో అలాంటి పాత్ర పోషించడం ఏంటని విమర్శలు తెరపైకి వచ్చాయి. కానీ కథను ..ఆ పాత్రను అనీల్ డీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రవితేజ కెరీర్ లో మరో మైల్ రాయిగా ఈ విజయం నిలి చింది. మరి ఇలాంటి ప్రయోగమే అక్కినేని అఖిల్ కూడా చేస్తున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి. అఖిల్ హీరోగా కి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో `లెనిన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అఖిల్ అదరగొట్టాడు. చిత్తూ రు మాండలీకంలో అఖిల్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో అఖిల్ పాత్రలో దృష్టి లోపంతో కూడి ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఆ లోపాన్ని ఆధారంగా చేసుకునే కథ సాగుతుందని అంటున్నారు. సినిమా ఆరంభం నుంచి అఖిల్ పాత్ర ముగింపు వరకూ అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అఖిల్ ఓ ప్రయోగం చేస్తున్నట్లే. ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది.