మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం లేదు. ఆమె పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతుంది అని కేసీఆర్ ఆమెని పార్టీ నుంచి బహిష్కరించారు. మరోపక్క కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలో నైతికత లేదు, అందుకే పార్టీలో ఉండలేను అంటూ పార్టీకి, ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చేసింది. కొద్దిరోజులుగా కొత్త పార్టీ పెడుతుంది అనుకున్నా కానీ తెలంగాణ జాగృతి ద్వారానే కవిత తన బలం చూపిస్తుంది.
తాజాగా కవిత శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం జరిగిందని హరీష్ రావు లాంటి కొందరు తనని స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా అనేక ఆంక్షలు విధించారని ఆమె ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా తాను ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని పార్టీలోని కొందరు అడ్డుకున్నారని, తనపై కక్షగట్టారని ఘాటు విమర్శలు చేశారు.
తనని నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చెయ్యమని చెప్పారు, కానీ తానేమి ఎంపీ సీటు అడుక్కోలేదని, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే ఛానల్స్ కానీ, పత్రికలు కానీ తనని ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు అని, పార్టీ కోసం పని చేసిన తనని అవమానించారని, ఇది ఆస్తుల పంచాయితీ కాదు.. ఇది నా ఆత్మగౌరవ పోరాటం అంటూ నిండు సభలో కవిత కన్నీరు పెట్టుకోవడమే కాదు..
తన ఇద్దరు కొడుకులపై, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నానని.. నైతికత లేని పార్టీలో తాను కొనసాగలేనని కవిత ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇక తనతో నడవాలి అనుకున్నవారు జాగృతిలో చేరమని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.