తెలుగు ఫిలింఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ వర్సెస్ మన ప్యానెల్ హోరా హోరీ పోటీలో మెజారిటీ ఈసీ సభ్యులను గెలుచుకుని ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ ఆధిపత్యం సాధించింది. డిసెంబర్ 2025 నుంచి డిసెంబర్ 2027 వరకూ కొత్త కార్యవర్గం పాలన కొనసాగించనుంది.
44 సీట్లలో 28 సీట్లను ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ గెలుచుకోగా, మన ప్యానెల్ తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, భరత్ చౌదరి, జెమిని కిరణ్ (స్టూడియో రంగం)లను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఆఫీస్ బేరర్లలో కార్యదర్శిగా అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి, కోశాధికారిగా ముత్యాల రాందాస్ ఎన్నికయ్యారు.
కొత్త అధ్యక్షుడు, కార్యవర్గం ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. టికెట్ రేట్లు, సినిమాల రిలీజ్‌లు, ఓటీటీ-శాటిలైట్ డీల్స్ లో సమస్యలు, వాణిజ్య ప్రకటనలు, కార్మికులతో సమస్యలు, అలాగే నిర్మాతలు, ఇతర శాఖల సంక్షేమం వంటి వాటిపై కొత్త కార్యవర్గం దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో అనుసంధానమై సినిమా పురోభివృద్ధికి కొత్త ఛాంబర్ కార్యవర్గం కృషి చేయాల్సి ఉంటుంది.