రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఫర్హాన్ అక్తర్ `డాన్ 3`ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. రితేష్ సిద్వాణీ ఈ చిత్రానికి సహనిర్మాత. రణ్ వీర్ కొత్త సంవత్సరంలో సెట్స్ పైకి అడుగుపెడతాడని ఫర్హాన్ భావించాడు. కృతి సనోన్ ని కథానాయికగాను ప్రకటించాడు. కానీ ఇంతలోనే ఊహించని పరిణామాలు ఫర్హాన్ కి షాక్‌నిచ్చాయి.
డాన్ 3 కథానాయకుడిగా నటించాల్సిన రణ్ వీర్ ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడు. డాన్ 3 నుంచి వైదొలిగాడని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. అతడు దురంధర్ గ్రాండ్ విక్టరీ తర్వాత దురంధర్ 2పైనే ఫోకస్ చేస్తాడు. ఈ సీక్వెల్ ని 2026 మార్చిలో విడుదలకు తేవాల్సి ఉంది. ఆ వెంటనే జోంబీ కథతో రూపొందే ప్రళయ్ చిత్రంలో నటించేందుకు మొగ్గు చూపుతున్నాడు. దీని అర్థం అతడికి డాన్ 3లో నటించాలని లేదు! అతడు ఇప్పుడు తన ఎంపికల్లో వైవిధ్యం ఉండేట్టు జాగ్రత్తపడుతున్నాడు.
దురంధర్ విజయం ప్రతిదీ మార్చేసిందని ముంబై మీడియా కథనాలు వండి వార్చింది. రణ్ వీర్ ఇప్పుడు తన ప్రణాళికను మరింత తెలివిగా మలుచుకుంటున్నాడు. ముఖ్యంగా నటించే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకే డాన్ 3ని డ్రాప్ చేసాడని కథనాలొస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. రణ్ వీర్ కానీ, ఫర్హాన్ కానీ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. రణ్ వీర్ ప్రళయ్ చిత్రానికి జై మెహతా దర్శకత్వం వహిస్తారు. దురంధర్ 2 కి ఆదిత్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు.