మెగాస్టార్ చిరంజీవి మేకోవర్ చూసి అంతా స్టన్ అవుతున్నారు. అన్నయ్య వింటేజ్ లుక్ అభిమానులు సహా ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ లాంటిందే. 70 ఏళ్ల చిరంజీవి ఏకంగా 40 ఏళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ఇదంతా చూసి దర్శకుడు అనీల్ రావిపూడి తన సినిమా కోసం అలా మార్చేసాడు అనుకుంటున్నారు. కానీ అసలు సంగతి వర ప్రసాద్ కోసం కాదని, మరో చిత్రం కోసమని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? చిరంజీవి నుంచి అంతగా మార్పు కోరుకున్నది ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
చిరంజీవి కథానాయకుడిగా `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల ఓ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. కానీ పట్టాలెక్కించలేదు. చిరంజీవి `విశ్వంభర`తో పాటు వర ప్రసాద్ షూటింగ్ లో బిజీ అయ్యారు తప్ప! శ్రీకాంత్ ప్రాజెక్ట్ మాత్రం మొదలవ్వలేదు. ఈ గ్యాప్ లోనే శ్రీకాంత్ నేచురల్ స్టార్ నానితో మరో సినిమా మొదలు పెట్టి ముగించే పనిలో ఉన్నాడు. మరి చిరంజీవి సినిమా ఏ కారణంగా హోల్డ్ లో పడినట్లు? అంటే లుక్ పరంగా చిరంజీవి నుంచి శ్రీకాంత్ భారీ మార్పులే కోరాడుట.
పీరియాడిక్ యాక్షన్ స్టోరీ కావడంతో చిరంజీవి అప్పటి లుక్ తో సినిమా చేస్తే బాగోదని.. తాను రాసిన కథకు లుక్ పరంగా మార్పులు కోరాడుట. అందుకు చిరంజీవి కొంత సమయం కావాలని అడగడంతో తాత్కలికంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టి మధ్యలోకి అనీల్ రావిపూడిని తీసుకొచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ ఆదేశాల మేరకు చిరంజీవి కసరత్తులు మొదలు పెట్టి వర ప్రసాద్ ని పట్టాలెక్కించారు.
చిరంజీవి ఇప్పుడు ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్నారు. భారీగా వెయిట్ లాస్ అయ్యారు. వింటేజ్ లుక్ లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. దీంతో శ్రీకాంత్ కోరిన లుక్ తీసుకు రావడానికి చిరంజీవికి దాదాపు ఏడెనిమిది నెలలు సమయం పట్టినట్లు తెలుస్తోంది. జిమ్.. డైట్ తోనే ఇంత వేగంగా రూపంలో మార్పులు చేసుకోవటం, జిమ్, డైట్ చేసి ఇంత త్వరగా లుక్ మార్చటం మాములు విషయం కాదు, థాట్ ఐస్ చిరంజీవి.