ప్రతియేటా ఏబీసీ చానెల్‌లో ప్రసారమవుతున్న ఆస్కార్ పురస్కారాలు మరో రెండేళ్లలో సబ్ స్క్రిప్షన్లతో పని లేని, ఉచిత వీక్షణ కోసం యూట్యూబ్ లో అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు ఏబీసీ చానెల్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆస్కార్ పురస్కారాల వైభవం ఇకపైనా ఇదేవిధంగా కొనసాగాలని సదరు సంస్థ ఆకాంక్షించింది.
ఆస్కార్ పురస్కారాల స్ట్రీమింగ్ హిస్టరీ పరిశీలిస్తే.. ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఏబీసీలో 1976 నుంచి ప్రసారమవుతున్నాయి. 2029తో ఈ చానెల్ నుంచి వేడుకలు యూట్యూబ్ కు మారతాయి. ఈ కార్యక్రమాన్ని కనీసం 2033 వరకు యూట్యూబ్ ప్రసారం చేస్తుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. ఆస్కార్స్ 2029 యూట్యూబ్‌లో ఉచితంగా స్ట్రీమ్ అవుతుందని కూడా వెల్లడించింది ఈ ప్రకటన.
ప్రఖ్యాత డిస్నీ యాజమాన్యంలోని ఆల్ఫాబెట్ నెట్‌వర్క్- 2028లో జరిగే 100వ ఎడిషన్ వరకు ఆస్కార్స్ అవార్డుల ప్రసారాన్ని కొనసాగిస్తుందని ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ తన కథనంలో పేర్కొంది. వందవ ఎడిషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ యూట్యూబ్‌లో, యునైటెడ్ స్టేట్స్‌లోని యూట్యూబ్ టీవీ సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యక్షంగా ఉచితంగా అవార్డుల కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. తాజా ఒప్పందం ప్రకారం.. యూట్యూబ్ ఆస్కార్స్ వేడుకను మాత్రమే కాకుండా, రెడ్ కార్పెట్ ప్రీ-షో, తెర వెనుక కార్యక్రమాలు, నామినేషన్ల ప్రకటన, గవర్నర్స్ అవార్డులు వంటి రకరకాల కంటెంట్‌ను కూడా ప్రసారం చేస్తుంది.
అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌కు గూగుల్ ఆర్ట్స్ & కల్చర్ మద్దతు కూడా లభిస్తుంది. ఇది ఎంపిక చేసిన ప్రదర్శనలు, కార్యక్రమాలకు డిజిటల్ యాక్సెస్ అందించడానికి సహాయపడుతుంది. అకాడమీ కలెక్షన్‌లో భాగమైన 52 మిలియన్లకు పైగా వస్తువులలో కొన్నింటిని డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతాయి. ఇక భారీ వేడుకల నుంచి నిష్కృమించేందుకు సిద్ధమైన ఏబీసీ నెట్ వర్క్ ..2028లో జరగబోవు చివరి పురస్కారాల కోసం ఆసక్తిగా చూస్తున్నామని ప్రకటించింది.