సాగరకన్య శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా దంపతులపై వరుస ఆరోపణలు మీడియా హెడ్ లైన్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం నీలి చిత్రాల యాప్ ల కేసులో రాజ్ కుంద్రా జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత కూడా అతడిపై వరుసగా రకరకాల ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల దీపిక్ కొఠారి అనే వ్యాపారవేత్త టీవీ చానెల్ పెట్టుబడులు, వాటా పేరుతో తనను 60 కోట్ల మేర మోసం చేసాడని, డబ్బును సొంత పనుల కోసం ఉపయోగించుకున్నాడని.. విదేశాలకు తరలించాడని ఆరోపించారు.
అయితే ఈ కేసులో ఓవైపు దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే శిల్పాశెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన బెంగళూరు బాస్టియన్ రెస్టారెంట్ ను మూసివేయాలని పోలీసులు కేసు ఫైల్ చేసారు. రెస్టారెంట్ ను మూసివేయాలని నోటీసులు ఇవ్వగా, గడువు దాటిన తర్వాత కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వచ్చిన ఒక రోజు తర్వాత శిల్పా శెట్టి ఇంటిపై ఐటి దాడులు జరిగాయి.
అయితే వారిపై ఎలాంటి ఐటి దాడులు జరగలేదని, కేవలం సాధారణ తనిఖీలు మాత్రమే జరిగాయని శిల్పా శెట్టి లాయర్ ప్రకటించారు. ఈ కేసులో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. సుప్రీం కోర్టులో క్వాష్‌కి దరఖాస్తు చేసాము. విచారణలో ఉండగా ఇలా ఏకపక్ష వార్తలు ప్రచురించడం సరైనది కాదని మీడియాపై కుంద్రా ఫైరయ్యారు.