హైదరాబాద్ లో అక్రమార్కుల ఆగడాలను అరికట్టడంలో హైడ్రా ( (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection ) క్రియేట్ చేసిన హైడ్రామా గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అక్రమ నిర్మాణాలను కుప్పకూల్చి ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా కృషిని కొందరు నిరసించినా, మెజారిటీ ప్రజలు ప్రశంసించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర అంశాలపైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు అనిపిస్తోంది.
మొన్నటికి మొన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ఉత్సవాలలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు తెలంగాణలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే ఒక పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ఒక శిక్షణా సంస్థను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇనిస్టిట్యూట్ లో సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్టుల్లో నైపుణ్య మెరుగుదల శిక్షణను అందిస్తారు. డ్రైవర్స్, లైట్ మెన్లు, స్పాట్ బోయ్స్, మేకప్ మేన్ ల నుంచి దర్శకులు, నటులు, సినిమాటోగ్రాఫర్లు, కళా రంగ నిపుణుల వరకూ అన్ని శాఖలలోను అవసరమైన శిక్షణను అందించేందుకు ఒక ఇనిస్టిట్యూట్ ని తేవాలని తెలంగాణ ప్రభుత్వం బలంగా నిర్ణయించుకుందని తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 100 ఎకరాల్లో ఒక కొత్త ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటునకు ప్రభుత్వం సన్నాహకాలు చేసే వీలుందని కూడా గుసగుస వినిపిస్తోంది. సినీపరిశ్రమకు ఏం కావాలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠంగా సినీపెద్దలను పిలిచి అడిగారట. దీంతో ఇప్పుడు ఎఫ్.డి.సి అధ్యక్షుడు దిల్ రాజు సారథ్యంలోని సినీపెద్దలు కూడా ఒక ప్రభుత్వ ఫిలింఇనిస్టిట్యూట్ అవసరమని చెప్పినట్టు గుసగుస వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. హైదరాబాద్ లోని అక్రమార్కుల పని పట్టేందుకు `హైడ్రా` పని చేసినట్టే, సినీపరిశ్రమలో వృత్తి నైపుణ్య శిక్షణ కోసం `హైడ్రా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్` (లేదా హైదరాబాద్ ఫిలింఇనిస్టిట్యూట్) ప్రారంభం కావాలని అందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు.