విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ నూనూగు మీసాల వయసు దశలో ఉన్నాడు. అతడు వేగంగా ఎదిగేస్తున్నాడు. అర్జున్ కి ఇప్పుడు 21. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం, కాలేజ్ చదువులను పూర్తి చేస్తున్నాడు. తండ్రి వెంకటేష్ లానే విదేశీ చదువులతో అతడు అపారమైన జ్ఞానాన్ని సాముపార్జిస్తున్నాడు. అదే సమయంలో ఫిలింస్కూల్ స్టడీస్ పైనా అతడు దృష్టి సారించాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి వంశంలో లెగసీని ముందుకు నడిపించేందుకు రానా ఒక్కడే సరిపోడు. అందుకే వెంకీ కుమారుడు అర్జున్ (21)ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ లో నిలబెట్టాలని దగ్గుబాటి కుటుంబం ఇప్పటి నుంచే ఆలోచిస్తోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెపోటిజం రభస ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ప్రతిదీ బహిరంగంగా ప్రకటించడం సాధ్యపడదు. అందుకే దగ్గుబాటి కుటుంబం కానీ, ఏ ఇతర ఫిల్మీ కుటుంబం కాని తమ వారసత్వ ఆరంగేట్రంపై ప్రకటించేందుకు అవకాశం లేదు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు ఓ ఇంటర్వ్యూలో వెంకీ కుమారుడు అర్జున్ ఆరంగేట్రం గురించి ప్రశ్న ఎదురైంది. ``పరిశ్రమలోకి వారసులొస్తున్నారు.. వెంకీ కుమారుడు అర్జున్ ని తీసుకుని వస్తున్నారా?`` అని ప్రశ్నించగా, ప్రస్తుతం అర్జున్ అమెరికాలో చదువుకుంటున్నాడని మాత్రమే సమాధానమిచ్చారు.
దీని అర్థం అతడు హీరోగా వస్తాడు లేదా రాడు! అనేది ధృవీకరించకపోవడమే. నటనలోకి అర్జున్ ఆరంగేట్రం గురించి అధికారికంగా ప్రకటించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని భావించాలి. ఒక పెద్ద సినీకుటుంబం నుంచి నటవారసుడు ఎంట్రీ ఇవ్వడం అంటే సంపూర్ణంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. అర్జున్ కు నటన, డ్యాన్సులు, ఫైట్స్ లో తర్ఫీదు తప్పనిసరి. ``అర్జున్ ఏ ఉపాధిని ఎంచుకుంటాడు అన్నది తన ఇష్టం. విధి ఏం నిర్ణయిస్తుందో కూడా చూడాలి`` అని వెంకటేష్ ఇంతకుముందు ఓ చాటింగ్ సెషన్ లో వ్యాఖ్యానించారు.