తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ సినీవర్గాల్లో చర్చగా మారింది. హైదరాబాద్ `గ్లోబల్ ఫిలిం హబ్` కావాలంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం కావాలి? అనే అంశంపై చిరు మాట్లాడుతూ అద్భుతమైన విషయాలను చర్చించారు. ముఖ్యంగా సినీరంగం హైదరాబాద్ వేదికగా గ్లోబల్ స్టాండార్డ్స్ తో ఎదగాలంటే స్కిల్ డెవలప్ మెంట్ అవసరమని అన్నారు.
దానికోసం ప్రభుత్వాలు ఒక మ్యాసివ్ ఇనిస్టిట్యూట్ ని పెట్టాలని కోరారు. డ్రైవింగ్, లైటింగ్, టైలరింగ్ లాంటి చిన్న శాఖలతో పాటు దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ సహా అన్ని శాఖలకు శిక్షణ అవసరమనే విషయాన్ని చిరంజీవి గ్లోబల్ సమ్మిట్ లో నొక్కి చెప్పారు. సీఎం రేవంత్, బట్టి విక్రమార్క వంటి ప్రముఖుల సమక్షంలో చిరు ఇచ్చిన ఈ సూచనను వారంతా సీరియస్ గా తీసుకుంటారనే ప్రజలు భావిస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో అధునాతన సాంకేతికతతో భవిష్యత్ తరాలకు ఉపకరించేలా ఫిలింస్టూడియోలను నిర్మించేందుకు ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖుల గురించి ప్రస్థావిస్తూ, ఇది సీఎం రేవంత్ విజన్ వల్లనే సాధ్యమవుతోందని అన్నారు. వారందరికీ సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తాను పరిశ్రమ తరపున రిప్రజెంటేటివ్ గా ఈ గ్లోబల్ సమ్మిట్ 2025కు వచ్చానని అన్నారు.
వినోదరంగం నుంచి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉంటుంది గనుకనే కేంద్రంలో వేవ్స్ సమ్మిట్ కి తమను ఆహ్వానించిన విషయాన్ని కూడా ఈ వేదికపై చిరు గుర్తు చేసుకున్నారు. వినోద రంగ ప్రముఖులు ఇలాంటి వేదికలపై అవకాశం కల్పిస్తున్నారు అంటే ఈ రంగంపై పెరిగిన గౌరవానికి ఇది నిదర్శనమని అన్నారు.