అమీర్ ఖాన్- ఆర్.మాధవన్- శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన 3 ఇడియట్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోని క్లాసిక్ హిట్స్ లో ఒకటి. స్నేహం, కళాశాల జీవితం నేపథ్యంలో చక్కని సందేశంతో ఈ సినిమాని హిరాణీ అద్భుతంగా తెరకెక్కించారు. ఇది యువతరంలో స్ఫూర్తి నింపిన చిత్రం. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లు వసూలు చేసింది.
అయితే చాలా కాలంగా `త్రి ఇడియట్స్` సీక్వెల్ గురించి చర్చ సాగుతూనే ఉంది. రాజ్ కుమార్ హిరాణీ స్క్రిప్టుపై పని చేస్తున్నా అంతకంతకు డిలే అవుతూనే ఉంది. అయితే దాదాసాహెబ్ ఫాల్కే స్క్రిప్టు సరిగా కుదరకపోవడంతో దానిని పక్కన పెట్టిన అమీర్- హిరాణీ జోడీ ఇప్పుడు `3 ఇడియట్స్` సీక్వెల్ స్క్రిప్టుపై దృష్టి సారించారని కథనాలొస్తున్నాయి.
2026 ద్వితీయార్థంలో ఈ సినిమాని పట్టాలెక్కించాలని ఈ జోడీ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచి కొనసాగింపులా ఉండేట్టు స్క్రిప్టును వందశాతం పర్ఫెక్ట్ గా రూపొందిస్తున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కొనసాగింపులోను మునుపటి నటులను తిరిగి తీసుకు వస్తారని కూడా తెలుస్తోంది.