తెలుగు చిత్రసీమలో ఎన్నడూ లేనంతగా ఆన్ లైన్ పైరసీ గురించి చర్చ సాగుతోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత పరిణామమిది. చాలా మంది ప్రజలు పైరసీకి కారణం టికెట్ బాదుడు అని, థియేటర్లలో కోలాలు, తినుబండారాల ఖరీదు కూడా ఒక కారణమని వాదించారు. అయితే ఎవరు ఏది అనుకున్నా, జనం ఎంతగా కలత చెందినా ఎగ్జిబిటర్లు కానీ, సినీ నిర్మాతలు కానీ టికెట్ ధరల తగ్గింపునకు ససేమిరా అనేస్తున్నారు.
పైగా టికెట్ పెంపు అనేది సమర్థనీయమని వాదిస్తున్నారు. తాజాగా పరిశ్రమ అగ్ర నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ.. పైరసీకి కారణాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో మాట్లాడారు. జనానికి కోపం.. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయి గనుకనే పైరసీలో చూస్తున్నారని సమర్థిస్తున్నారు. ఈ జనం అతడికే మద్ధతు పలకుతున్నారని సురేష్ బాబు అన్నారు.
ఇది నిజమే అనుకుంటే, అతడు వ్యక్తిగత డేటాను దొంగిలించడం మీకు సమస్య కదా? ఎలాంటి కలత లేదా? అని కూడా సురేష్ బాబు ప్రశ్నించారు. మొత్తానికి ఆయన మాటల్లో జనాలకు కోపం ఉంది! అని అంగీకరించారు. పైరసీకి అసలు కారణం ఏమిటో సురేష్ బాబు స్వయగా చెప్పేసారు. అయితే టికెట్ ధరల తగ్గింపు గురించి ఆయన ఎక్కడా ప్రస్థావించలేదు. సినీపెద్దలు టికెట్ ధరల తగ్గింపు ఆలోచన చేయరు గనుక, సీపీఐ నారాయణ చెప్పినట్టు 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టుకు రావడం ఖాయమే!