`కల్కి 2` నుంచి దీపికా పదుకొణే ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శక, నిర్మాతలతో సెట్ కాకపోవడంతో అమ్మడు మరో ఆలోచన లేకుండా ప్రాజెక్ట్ నుంచి నిష్రమించింది. దీంతో ఆ పాత్రను ఏ హీరోయిన్ తో భర్తీ చేస్తారు? అన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. దీనిలో భాగంగా బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కత్రినా కైఫ్, అలియాభట్, కరీనా కపూర్ ఇలా వీళ్లందర్నీ పరిశీలించిన అనంతరం చివరిగా ఆ పాత్రకు అనుష్క అయితేనే బాగుంటుందని చిత్ర వర్గాల నుంచి తెలిసింది.
ప్రభాస్ తో గత సినిమాల్లో నటించిన అనుభవం సహా.. గర్భవతి సుమతిగా..అటుపై మామ్ పాత్రకు పర్పెక్ట్ సూటువుతందని బలమైన ప్రచారమే జరిగింది. దీంతో అనుష్క ఎంట్రీ దాదాపు ఖాయమనుకున్నారు. ఈ ప్రచారం నిజమైతే బాగుండని సోషల్ మీడియా వేదికగా అనుష్క వైపే ఓట్లు పడ్డాయి. తెలుగు ఆడియన్స్ కూడా అనుష్కకు మద్దతుగా నిలిచారు. ప్రభాస్ సరసన మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అనుష్కను చూడాలని ఆశపడ్డారు. ఇదంతా అనుష్కకు పాజిటివ్ గా మారింది.
కానీ ఇంతలోనే అనుష్కకు పోటీగా ప్రియాంక చోప్రా దిగింది. `వారణాసి`తో ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `కల్కి` మేకర్స్ అనుష్క కంటే గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న పీసీ అయితే బాగుంటుందనే ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కానీ ఇది జరగాలంటే? పీసీ అడిగినంత పారితోషకం ఇవ్వాలి. అంత మొత్తంలో నిర్మాతలివ్వడం అన్నది అంత ఈజీ కాదు.
దీపికా పదుకొణేతో వివాదానికి కారణమే అథిక పారితోషికం డిమాండ్ చేసిందని. అలాంటిది హాలీవుడ్ రేంజ్ నటి అయిన పీసీ డిమాండ్ పీక్స్ లోనే ఉంటుంది. ఈ కోణంలో చూస్తే నిర్మాతలు అనుష్క వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. `కల్కి` మొదటి భాగం కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మేకర్స్ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే పార్ట్ 2 బడ్జెట్ అదుపు తప్పకుండా చూస్తారు.