చాలా కాలం క్రితం బుల్లితెర హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్ పై కెనడాలో కొందరు దుండగులు కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్న భారతీయ పోలీసులు విస్తుపోయే నిజాల్ని వెల్లడిస్తున్నారు. ఇది ఒక సినిమాటిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తక్కువేమీ కాదు!
నిజానికి కెనడా కేఫ్ పై కాల్పులకు కారణం కపిల్ శర్మతో వివాదం కాదు.. అంతకుమించి ఈ గొడవ వెనక కారణాలు ఉన్నాయి. ఇది రెండు ముఠాల మధ్య గొడవ. వ్యక్తిగత కక్షలతో కాల్పులు జరిపారు. ఇందులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచర వర్గంతో బింబిహా గ్యాంగ్- గోల్డీ బ్రార్ అనుచర వర్గానికి మధ్య యుద్ధం నడుస్తోంది. వీరంతా అమెరికా, మలేషియా, కెనడా, యూరోపియన్ దేశాలలో స్థావరాలు ఏర్పరుచుకుని గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ ని నడిపిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా భారతదేశం నుంచి విదేశాలకు పారిపోయి, అక్కడి నుంచి భారత్‌లో యాక్టివిటీస్ నడిపిస్తున్నారు.
నిజానికి కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులకు సహకరించిన వ్యక్తి బంధుమాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు. అతడికి ప్రత్యర్థి ముఠా కు చెందిన గ్యాంగ్ స్టర్ నుంచి (మలేషియా నుంచి) వార్నింగులు అందాయి. ఇలాంటివి మళ్లీ జరిగితే లేపేస్తామని అతడిని హెచ్చరించినట్టు పంజాబ్ లుథియానాలో దొరికిపోయిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు బంధుమాన్ వెల్లడించాడు.
దీనిని బట్టి పంజాబీ గ్యాంగ్ స్టర్స్ ప్రపంచం మొత్తం చుట్టేసి ఆటాడుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అదే సమయంలో అతడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1600 మంది షార్ప్ షూటర్లను మెయింటెయిన్ చేస్తూ, డ్రామాను రక్తి కట్టిస్తున్నాడు.