బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న దేశభక్తి ప్రధాన చిత్రం - బ్యాటిల్ ఆప్ గల్వాన్ వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా సౌత్ సూపర్ స్టార్ యష్ నటించిన టాక్సిక్, బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటించిన ధమాల్ 4 చిత్రాలతో పోటీపడాల్సి ఉందని గుసగుస వినిపిస్తోంది.
సల్మాన్ నటించిన ఇటీవలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. మనీష్ శర్మ తెరకెక్కించిన టైగర్ 3 సహా మురుగదాస్ -సికందర్ కూడా భారీ ఫ్లాపులుగా మారాయి. ఇలాంటి సమయంలో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఉన్న యష్ తో సల్మాన్ పోటీపడాల్సి ఉంటుంది. యష్ టాక్సిక్ టీజర్, పోస్టర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అయితే సల్మాన్ తన సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయబోతున్నారనేది కూడా చాలా కీలకం. మరోవైపు అజయ్ దేవగన్ ధమాల్ 4 కూడా క్రేజ్ ఉన్న సినిమా. దీంతో భాయ్ ఆ ఇద్దరితో పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.
వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ దేశభక్తి కథాంశం, చైనా బార్డర్ లో ఇండియన్ ఆర్మీ అధికారుల సాహసోపేతమైన బాహాబాహీ పోరాటం నేపథ్యంలో అత్యంత క్రేజీగా రూపొందుతోంది. ఈ సినిమా ఏకంగా 325 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాగించిందని కూడా కథనాలొస్తున్నాయి.
గంపగుత్తగా బేరం కుదిరింది:
బాక్స్ ఆఫీస్ వరల్డ్‌వైడ్ కథనం ప్రకారం.. బాటిల్ ఆఫ్ గల్వాన్ మ్యూజిక్ హక్కులు, శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కులు సహా థియేట్రికల్ పంపిణీ హక్కులతో కూడిన బ్లాంకెట్ డీల్ ని కుదుర్చుకునేందుకు జీ సినిమా ముందుకు వచ్చింది. జియో స్టూడియోస్ ఏకంగా 325 కోట్లకు ఒప్పందాన్ని ముగించడానికి అంగీకరించిందని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.