ఐబొమ్మలో ఉచితంగా పైరసీ సినిమా చూసానని, కానీ తనకు రవి పేరు తెలియదని అన్నారు సీనియర్ నాయకులు సీపీఐ నారాయణ. అయితే తాను వందల డబ్బు ధారపోయకుండా, ఉచిత సినిమాలు ఎలా చూస్తారో తణిఖీ చేసేందుకే అలా చేసానని అన్నారు. ఎప్పుడో కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు పైరసీలో సినిమాలు చూసానని నారాయణ వ్యాఖ్యానించారు.
అయితే చాలా మంది రొమ్ములు విరుచుకుని ఐబొమ్మ రవిని ఉరి తీయాలని మైకుల ముందు కోరుతున్నారు. అయితే అతడిని ఉరి తీయడం వల్ల ఎలాంటి ప్రయోజన ఉండదు. ఒక రవి పోతే మరో వంద మంది ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారని కూడా సీపీఐ నారాయణ అన్నారు. అణచివేస్తే లేదా చంపేస్తే హిడ్మాలు, రవిలు పుట్టుకొస్తారని దానిని ఆపలేమని వ్యాఖ్యానించారు. అసలు సమస్య ఇది కాదు. వ్యవస్థలో లోపమే ఐబొమ్మ రవి పుట్టడానికి కారణం. దానిని సరి చేయకుండా తప్పుదారి పట్టిస్తున్నారు.
ప్రభుత్వాలే టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు ఐబొమ్మలో ఉచితంగా సినిమాలు చూస్తే తప్పు లేదు కదా! అని ప్రజలు అంటున్నారు. సమస్యకు మూలాన్ని గుర్తించి దానిని సరి చేయాల్సి ఉందని కూడా నారాయణ సూచించారు. 600 పెట్టి టికెట్ కొని సినిమాలు చూడగలరా? అని కూడా ప్రశ్నించారు. ఐబొమ్మ రవి పోవాలని పదుల సంఖ్యలోనే కోరుకుంటున్నారని వారంతా ఇండస్ట్రీ వారేనని.. కానీ లక్షల మంది ఐబొమ్మ రవి ఉండాలని కోరుకుంటున్నారని కూడా సీపీఐ నారాయణ అన్నారు. అయితే తాను పైరసీ అనే తప్పుడు పనిని సమర్థించడం లేదని వ్యాఖ్యానించారు.