ఇన్ని రోజులు సినిమా టికెట్ ధరలే పైరసీకి కారణమని ప్రజలు తప్పుగా భావిస్తున్నారు. కానీ దానికి అసలు కారణం వేరే ఉంది. ఈ మహమ్మారీ ఎదుగుదలకు టికెట్ ధరలు అసలు కారణం కాదు. థియేటర్లలో తినుబండారాలు, కోక్ లు, పార్కింగ్ ఫీజు వగైరా వగైరా కారణాలున్నాయని ప్రజల్లో డిబేట్ మొదలైంది. టికెట్‌కి చెల్లించే మొత్తం కంటే ఫ్యామిలీ ఆడియెన్ నాలుగైదు రెట్లు కేవలం తినుబండారాలు, కోక్ ల కోసం చెల్లించుకోవాల్సి రావడం పెను భారంగా మారుతోందని, దీని బెడద తగ్గించుకునేందుకే జనం థియేటర్లకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటున్నారని కొత్త విశ్లేషణలు వేడెక్కిస్తున్నాయి. ఇక థియేటర్లలో పార్కింగ్ ఫీజులను ఇష్టానుసారం పెంచుకుని వసూలు చేయడం రెగ్యులర్ గా చూస్తున్నదే. తినుబండారాలు, కోలాలు, పార్కింగ్ ఫీజుల ధరల కట్టడికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. పర్యవసానంగా సింగిల్ హాల్స్, మల్టీప్లెక్సుల్లో ఇష్టానుసారం బాదేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టే, తెలుగు చిత్రసీమను కుంగదీసేలా ఇవన్నీ పైరసీ మాఫియా ఎదుగుదలకు మరింత ఊతమిస్తున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి.
తాజాగా `ప్రొగ్రెస్సివ్ యూత్ లీగ్` అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ సంథ్య థియేటర్ లో తినుబండారాలు, కోలాల ధరలను, పార్కింగ్ ఫీజు ధరలపై సర్వే చేపట్టింది. థియేటర్ వద్ద ప్రజల అభిప్రాయ సేకరణ, సంతకాల కోసం ప్రయత్నించగా థియేటర్ వద్ద గాలాట జరిగింది. కేవలం రూ. 30 ధర ఉండే తినుబండారాలను 300కు అమ్ముతున్నారని, రూ.40 ధర ఉండే వాటిని 400కు అమ్ముతున్నారని యూత్ లీగ్ ప్రతినిధి మీడియా ఎదుట వెల్లడించారు. దీనిపై ప్రేక్షకుల నుంచి సంతకాల సేకరణ చేపడితే దానికి థియేటర్ యాజమాన్యం అంగీకరించలేదని ఆయన తెలిపారు.
సినిమా థియేటర్లలో తాగడానికి కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేకుండా చేస్తూ, ప్రేక్షకులను హింసిస్తున్న వైనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. కేవలం తినుబండారాలు, కోలాలు వంటి అదనపు ఖర్చు పైరసీ మాఫియాని పెంచి పోషిస్తోందని కూడా ఆవేదన వ్యక్తమైంది. అదుపు తిప్పిన టికెట్ ధరలు, తిండి కోలాల ధరలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించకపోతే, 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారని కూడా కొందరు శపిస్తున్నారు.