ఆస్కార్ విన్నింగ్ `నాటు నాటు`(ఆర్.ఆర్.ఆర్) పాటను ఆలపించి ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. ఓల్డ్ సిటీ(పాతబస్తీ-హైదరాబాద్) కి చెందిన ఈ యువకుడు ఇప్పుడు తన ప్రియురాలు హిరణ్య రెడ్డిని పెళ్లాడాడు. హైదరాబాద్ గచ్చిబౌళిలో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీరాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
ఏపీ టీడీపీ నాయకుడు, సుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కి సోదరుని కుమార్తె హిరణ్య. ఈ జంట నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం వైభవంగా జరిగింది. రాహుల్-హిరణ్య జంట వివాహం పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహం.
ప్రస్తుతం ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రాహుల్- హిరణ్య రెడ్డితో క్రికెటర్ చాహల్ దిగిన ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఇక ఇదే వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. జోష్ చిత్రంతో గాయకుడిగా కెరీర్ ప్రారంభించిన రాహుల్ టాలీవుడ్ లో ఎన్నో చార్ట్ బస్టర్ పాటలను ఆలపించాడు.
పలు ఆల్బమ్స్ లోను అతడు నటించాడు. రాహుల్ హీరోగా సినిమా కూడా చిత్రీకరణకు వెళ్లిందని కథనాలొచ్చాయి. అతడు మాటీవీలో బిగ్ బాస్ షో విజేతగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు.