ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయిన దర్శకుడు మారుతి వెంటనే ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఆదివారం సాయంత్రం జరిగిన రాజా సాబ్ ఈవెంట్ లో తన హీరో ప్రభాస్ ని పొగిడే సందర్భంలో మారుతి మాట్లాడుతూ.. తను ప్రస్తుతం రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాన్నని, ప్రభాస్ తన టాలెంట్ గుర్తించి యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారని..
ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవడైనా టాప్ డైరెక్టర్ అయిపోవచ్చని భారీ స్టేట్మెంట్ ఇచ్చిన మారుతి అదే ఉత్సాహంతో రేపు పండక్కి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పను.. ఎందుకంటే ఈ కటౌట్ కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయి అంటూ కాలర్ పై చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యేలా చేసాయి.
కారణం ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా అంటే దేవర విడుదల సమయంలో, వార్ 2 విడుదల సమయంలో కాలర్ ఎగరేసే హిట్ కొడుతున్నామంటూ చెప్పడం, ఆ సినిమా ఫలితాలు తారు మారు అవడంతో ఎన్టీఆర్ ని విమర్శకులు చీల్చి చెండాడారు, అలాగే ఎన్టీఆర్ కాలర్ కామెంట్స్ ను ట్రోల్ చేసారు. అలా మారుతి కాలర్ గురించి మాట్లాడను అంటూ చేసిన కామెంట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం
తెప్పించాయి.
మీ హీరోని పొగుడుకోండి కాదనం, కానీ మీ హీరో కోసం ఇతర హీరో ని కించపరచకూడదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతి ని ట్రోల్ చేస్తున్నారు. అది తెలిసిన మారుతి.. వెంటనే రియాక్ట్ అవుతూ.. నేను నా కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ప్రతి అభిమానికి నేను హృదయపూర్వకంగా నా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. స్టేజ్‌పై మాట్లాడే సమయంలో కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న దానికి పూర్తి భిన్నంగా విషయాలు బయటకు వస్తాయి.
నేను మాట్లాడిన మాటలను మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. నాకు ఎన్టీఆర్ గారి పట్ల, ఆయన అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీరు చూపించే ప్రేమను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. నేను ఆయనని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పూర్తి నిజాయితీతో, మనస్ఫూర్తిగా వివరణ ఇస్తున్నాను. అంతేకాదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సారీ చెప్పారు.